Manipur | బిరేన్‌సింగ్‌ తప్పుకోవాలి.. అప్పుడే మణిపూర్‌లో శాంతి: జైరాంరమేశ్‌

Manipur ప్రధాని ఇకనైనా స్పందించాలి కాంగ్రెస్‌ నేత జైరాంరమేశ్‌ న్యూఢిల్లీ: మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బిరేన్‌సింగ్‌ ఉన్నంత కాలం ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అడుగులు పడబోవని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ చొరవ చేసి, రంగంలోకి దిగాలని సూచించారు. అంతేకానీ కూలిపోతున్న డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు వక్రీకరణలకు పాల్పడవద్దని హితవు పలికారు. మణిపూర్‌లో కొనసాగుతున్న హింస విషయంలో రోజులు గడుస్తున్న […]

Manipur | బిరేన్‌సింగ్‌ తప్పుకోవాలి.. అప్పుడే మణిపూర్‌లో శాంతి: జైరాంరమేశ్‌

Manipur

  • ప్రధాని ఇకనైనా స్పందించాలి
  • కాంగ్రెస్‌ నేత జైరాంరమేశ్‌

న్యూఢిల్లీ: మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బిరేన్‌సింగ్‌ ఉన్నంత కాలం ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అడుగులు పడబోవని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ చొరవ చేసి, రంగంలోకి దిగాలని సూచించారు. అంతేకానీ కూలిపోతున్న డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు వక్రీకరణలకు పాల్పడవద్దని హితవు పలికారు.

మణిపూర్‌లో కొనసాగుతున్న హింస విషయంలో రోజులు గడుస్తున్న కొద్దీ వాస్తవాలు నీరు గారి పోతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూకలు, సాయుధ దుండగులు, మిలిటెంట్‌ గ్రూపులు చెలరేగిపోతున్నాయని, మహిళలు, కుటుంబాలు దయనీ స్థితికి గురవుతున్నారని, వారిపై ఆగడాలకు అంతే లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిపాలన యంత్రాంగం హింసలో భాగం అవడమే కాకుండా.. చురుకుగా ఉంటూ విద్వేషాలను రెచ్చ గొడుతున్నదని మండిపడ్డారు. రెండు తెగల మధ్య విశ్వాసం విచ్ఛిన్నం కావడంతో రాష్ట్ర సామాజిక స్వభావం పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి నుంచి బిరేన్‌సింగ్‌ తప్పుకొంటే తప్ప.. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అవకాశాలు ఉండబోవని స్పష్టం చేశారు.

స్పందించేందుకు ప్రధానికి ఇప్పటికే సమయం మించిపోయిందని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో మే 3న మొదలైన హింసాకాండలో ఇప్పటి వరకూ 160 మంది చనిపోయారు. వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి.