వైభవంగా మత్స్యగిరి లక్ష్మినరసింహుల కల్యాణోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం శనివారం వైభవంగా సాగింది

  • By: Somu    latest    Nov 25, 2023 12:18 PM IST
వైభవంగా మత్స్యగిరి లక్ష్మినరసింహుల కల్యాణోత్సవం

విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం శనివారం వైభవంగా సాగింది. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా ఎదుర్కోలు ఘట్టాన్ని నిర్వహించారు. వధూవరులు లక్ష్మినరసింహులను పట్టు వస్త్రాలు, రత్నఖచిత ఆభరణాలతో ముస్తాబు చేసి కల్యాణ వేదిక పై కొలువుతీర్చి పాంచరాత్రగమ శాస్త్రానుసారం అర్చక పండితులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.


శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మంగల్యాధారణ, తలంబ్రధారణ ఘట్టాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించిన భక్తజనం గోవింద నామస్మరణలతో పులకించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా సహాయ కమిషనర్ కె. మహేందర్ కుమార్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాతలు, ఆలయ అర్చకులు సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.