మేడిగ‌డ్డ నిర్మాణం భారీ కుంభకోణం!.. విచారణలో విస్తుపోయే నిజాలు!

ప్ర‌పంచ అద్భుతంగా బీఆరెస్ ప్ర‌భుత్వం చెప్పుకొన్న కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ దేశంలోనే భారీ స్కాంగా నిలువ‌నుందా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి

మేడిగ‌డ్డ నిర్మాణం భారీ కుంభకోణం!.. విచారణలో విస్తుపోయే నిజాలు!

నిర్మాణంలో నాణ్యత లేదు.. ప్రమాణాలూ లేవు

3200 కోట్ల ప్ర‌జాధ‌నం వృథా

బరాజ్‌ నిర్మాణంలో పాల్గొన్న 

ప్ర‌తి ఒక్క‌రూ దీనికి బాధ్యులే

తీవ్రంగా దెబ్బ‌తిన్న పియ‌ర్స్ 11

పూర్తిగా దెబ్బ‌తిన్న20వ పియ‌ర్‌

వంద మీట‌ర్ల దూరం కొట్టుకొచ్చిన‌ 

10 ట‌న్నుల సిమెంట్ బ్లాక్స్‌

విజిలెన్స్‌ అధికారుల విచారణలో 

వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

వారంలో మ‌ధ్యంత‌ర నివేదిక‌?

విధాత‌: ప్ర‌పంచ అద్భుతంగా బీఆరెస్ ప్ర‌భుత్వం చెప్పుకొన్న కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ దేశంలోనే భారీ స్కాంగా నిలువ‌నుందా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో కీల‌క‌మైన మేడిగ‌డ్డ బరాజ్‌ నిర్మ‌ణంలో రూ.3200 కోట్ల ప్ర‌జా ధ‌నం వృథా చేశార‌న్న అభిప్రాయం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచార‌ణ‌లో వ్యక్తమైనట్టు స‌మాచారం. ఈ మేర‌కు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మ‌ధ్యంత‌ర నివేదిక‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలిసింది. మ‌రో వారం రోజుల్లో దానిని ప్ర‌భుత్వానికి ఇవ్వ‌నున్న‌ట్లు సమాచారం. విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం మేర‌కు మేడిగడ్డ బరాజ్‌లో మొత్తం 11 పియ‌ర్స్ దెబ్బ‌తిన్నాయి. 20వ పియర్ పూర్తిగా దెబ్బతిన్నది. దీని ప్రభావం 11 పియర్స్ వరకు వ్యాపించిందని విజిలెన్స్ గుర్తించిందని తెలుస్తోంది. మిగతా పియర్స్‌ ఎంత మేర‌కు బ‌లంగా ఉన్నాయి? అస‌లు అవి బలంగా ఉన్నాయా? బలహీనంగా ఉన్నాయా కూడా అనేది తేల్చ‌డానికి విజిలెన్స్ సిద్ధమైందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. 

 

ప్ర‌మాదంలో బరాజ్‌

మేడిగడ్డ బరాజ్‌ మొత్తం ప్ర‌మాదంలో ఉన్న‌ట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారని సమాచారం. ముఖ్యంగా బరాజ్‌ కింది భాగంలో 10 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్‌ వంద మీటర్లు దాటి కొట్టుకుపోవ‌డం ఈ ప్ర‌మాదం తీవ్రతకు సంకేతంగా భావిస్తున్నారు. బరాజ్‌ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని, రెండు మూడేళ్ల క్రితం నుంచే సమస్య మొద‌లై ఉండొచ్చని విజిలెన్స్‌ భావిస్తోంది. గోదావ‌రి న‌దికి వ‌చ్చే వ‌ర‌ద ప్ర‌వాహానికి త‌గిన‌ట్లుగా డిజైన్ లేద‌ని విజిలెన్స్‌ భావించిన‌ట్లు సమాచారం. అంతే కాకుండా సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నుంచి నివేదిక తెప్పించుకోలేదన్న విష‌యాన్ని గుర్తించారు. గోదావ‌రికి వ‌చ్చే వరద ఉధృతిపై అంచనా లేకుండానే డిజైన్ రూపొందించిన‌ట్లు ప్రాథమిక అంచ‌నాకు వ‌వచ్చారని సమాచారం. 10 టన్నుల బ‌రువుండే సిమెంట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో పియర్స్‌ కింద ఇసుకలో కదలిక ఏర్ప‌డింద‌ని, దీంతో రాఫ్ట్‌ దిగువన ఖాళీ ఏర్పడిందని గుర్తించారు. అలాగే పియర్స్‌పైన తక్కువ కాలంలోనే సిమెంటు లేచిపోయిన విష‌యాన్ని గ‌మ‌నించారు. రాఫ్ట్‌ కింద ఇసుక కొట్టుకుపోయి ఖాళీ ఏర్ప‌డ‌డంతో బరాజ్‌ కుంగింద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. గడ్డర్ల వద్ద పగుళ్లు, ఉపయోగించిన స్టీల్స్‌ చూస్తే నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోందని విజిలెన్స్ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దెబ్బ‌తిన్న ఈ పియ‌ర్స్‌కు మ‌ర‌మ్మ‌తులు చేసిన‌ప్ప‌టికీ బరాజ్‌ మొత్తం భద్రంగా ఉంటుంద‌నే గ్యారెంటీ లేదని విజిలెన్స్‌ అధికారులు భావించినట్టు సమాచారం. బరాజ్‌ లొకేష‌న్ కానీ, డిజైన్ కానీ, నిర్మాణం, నిర్మాణంలో నాణ్య‌త నిర్వ‌హ‌ణ వ‌ర‌కు అంత గంద‌రగోళంగా ఉంద‌ని విచారణ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ప్ర‌జా ధ‌నంతో మేడిగ‌డ్డ నిర్మించార‌ని, అయితే నిర్మాణం జ‌రిగిన తీరు బాగా లేద‌ని, ఈ నిర్మాణంలో భాగ‌స్వాములైన ప్ర‌తి ఒక్క‌రు దోషులేన‌న్న నిర్ణ‌యానికి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మేడిగడ్డపై స‌మాచారం అందించిన‌ట్లు సమాచారం.