Kaleshwaram Project| కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బ్యారేజీల రిపేర్లకు టెండర్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

విధాత, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని( Kaleshwaram Project) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు(Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage) రిపేర్లు(Repairs) చేయాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Governament) కీలక నిర్ణయం తీసుకుంది. వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం టెండర్లు(Tenders), పిలిచింది. దీనికోసం ఈ నెల 15 వరకు గడువు విధించింది. డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరుతూ జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దెబ్బతిన్న బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) తన రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం సంక్పల్పించింది. వరదల తర్వాత భూభౌతిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. టెండర్లలో అఅర్హత సాధించిన సంస్థలను సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వాములను చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే వర్షా కాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం వరదల కారణంగా వర్షా కాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పునరుద్దరణకు వేగంగా అడుగులు
2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో పియర్స్ కుంగడంతో పాటు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణపై ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకెళ్లాలని ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. అనేక చర్చల అనంతరం ఐఐటీలకు అప్పగించాలన్న నిర్ణయం నుంచి నీటిపారుదల శాఖ వెనక్కి తగ్గింది. ఈవోఐ విధానంలోనే డిజైన్ల ఖరారుకు ఓకే చెప్పింది. తాజాగా పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానం పలికింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణకు డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కూడా బ్యారేజీ నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలి. అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలకు సీల్ కవర్స్ ఓపెన్ చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ తెలంగాణ నీటిపారుదల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
నిన్న గుదిబండ అన్న ప్రాజెక్టుకు నేడు పునరుద్ధరణ
కాళేశ్వరం ప్రాజెక్టును నిన్నమొన్నటిదాక రాష్ట్రానికి గుదిబండ అని..ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ పాలకులు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ప్రాజెక్టు పునరుద్దరణకు నిర్ణయించడం చర్చనీయాంశమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి 600 పేజీలతో రిపోర్టును పీసీ ఘోష్ కమిషన్ అందించింది. కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సీబీఐ కేసును టేకప్ చేసిన సీబీఐ.. విచారణను ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ సహా హరీష్ రావు, ఈటలతో పాటు పలువురు అధికారులను విచారించనుందని తెలుస్తోంది. మరోవైపు కాగ్ సహా విజిలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ కూడా కాళేశ్వరం నిర్మాణ అక్రమాలను నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో నిన్నటిదాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పునరుద్దరణ కోసం టెండర్లు ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మితమైన ప్రాజెక్టును నిరూపయోగంగా వదలివేస్తే మరింత నష్టమన్న ఆలోచనతో పాటు..ఎన్టీఎస్ఏ సిఫారసుల మేరకు పునరుద్దరణ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల మరమ్మతుకు డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వాదనకు బలపరిచేదిగా ఉంది. అదే సమయంలో పునురుద్దరణకు నిధుల కేటాయింపులతో వచ్చే కమిషన్లు కూడా కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణకు ఓ కారణం కావచ్చన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.