Congress: తెలంగాణ కాంగ్రెస్‌పై.. మీనాక్షి మార్కు ఉంటుందా?

  • By: sr    latest    Mar 01, 2025 3:35 PM IST
Congress: తెలంగాణ కాంగ్రెస్‌పై.. మీనాక్షి మార్కు ఉంటుందా?
  • రాష్ట్ర కాంగ్రెస్ కు ముచ్చటగా మూడవ ఇంచార్జి
  • తొలిసారి పార్టీ శ్రేణులతో సమావేశమైన మీనాక్షి
  • ఇంచార్జుల మార్పుల వెనుకు అంతర్యమేమిటీ ?
  • సమన్వయ లోపమా? సంస్థాగత మార్పులా?
  • కాంగ్రెస్ ను వెంటాడుతున్న అంతర్గత సమస్యలు
  • కాంగ్రెస్ అధిష్టానం, పార్టీ శ్రేణుల్లో భారీ ఆశలు

తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడవ వ్యక్తి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు నారాయణ రాణే ఠాకూర్, దీపాదాస్ మున్షీలు రాష్ట్ర పార్టీ ఇంచార్జులుగా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఇద్దరి నియామకాల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆశాభావ చర్చ సాగింది. ఇక కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరిగి, కొత్త పుంతలు తొక్కుతుందని భావించారు. పాత కాంగ్రెస్ పద్ధతులకు చెక్ పెట్టి కొత్తగా ‘క్రమశిక్షణ’ తో ఉరుకులు పరుగులు తీస్తుందని భావించారు. నారాయణ ఠాకూర్ నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆయనను ఆకస్మికంగా మార్చేశారు. తర్వాత మున్షీని తీసుకొచ్చారు. కానీ తర్వాత ఏమైందీ? ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగా మారింది. ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు ముందుకు వచ్చాయనే చర్చ సాగుతోందీ. మరి మూడవ ఇంచార్జి మీనాక్షి రంగప్రవేశంతో నైనా పార్టీలో నెలకొన్న సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుందా? మీనాక్షి తరహా మార్కు ఉంటుందా? అనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రెడ్చొచ్చెమోదలాయే.. అన్నట్లుగా ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

నూతన ఇంచార్జ్ గా మీనాక్షి బాధ్యతలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ గా నియామకమైన మీనాక్షి నటరాజన్ తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఆమె తొలిసారి రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులతో శుక్రవారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఈ తొలి సమావేశం మాత్రం ఒకింత పాజిటీవ్ సంకేతాలు వెలువడ్డాయి. ఈ సానుకూల సంకేతాలు ఎంతకాలం ఉంటాయో? రానున్న రోజుల్లో ఏమేరకు సత్ఫలితాలనిస్తుందోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయిన నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అవసరమైన ‘మార్పు’ జరుగుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. మీనాక్షి నటరాజన్ పై మాత్రం ఆ పార్టీ శ్రేణులతో పాటు, అధిష్టానం కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి.

అధికార మార్పు కోరుకున్న తెలంగాణ

పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలు గద్దె దింపారు. మార్పు కోసం మా పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు జనం సానుకూలంగా స్పందించారు. మీరు చెబుతున్న ‘ మార్పు’ మంచిదే అంటూ.. మీ వెంట మేము నిలుస్తామంటూ తెలంగాణ ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే కుమ్ములాటలకు భిన్నంగా ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయం కూడా ఈ దఫా కొంత మేరకు సాఫీగానే సాగింది. సీఎం ఎవరవుతారనే చర్చకు తెరదించుతూ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు మోసిన రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ అధిష్టానం సైతం సస్పెన్షన్ కు తెరదించారు. రేవంత్ ఆధ్వర్యంలో ఏడాదిన్నర కాలంగా పాలన సాగుతుండగా ఆయన స్థానంలో నూతన పీసీసీ అధ్యక్షు డిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు.

సమన్వయలోపం.. సమస్యల నిలయం

కొత్త ఇంచార్జ్ మీనాక్షి (Meenakshi Natarajan) రాకతోనైనా రాష్ట్ర కాంగ్రెస్ (Telangana Congress) పార్టీలో ఆశించిన స్థాయి మార్పు ఉంటుందా? పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం అగ్ని పరీక్షగా భావిస్తున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న లోపాలను సవరించి, సమన్వయం సాధించడంలో విజయవంతమవుతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్న సమన్వయాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ధీటైన సమాధానం చెప్పే కార్యక్రమాన్ని కొనసాగిస్తారా? ప్రజల మనుసును గెలుచుకునే కార్యక్రమాలు కొనసాగుతాయా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ, ప్రభుత్వంలో మార్పులుంటాయని, మంచి రోజులొస్తాయనే ఆశాభావం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక వర్గాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేశారు. వీరంతా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉండగా పదేండ్లు అనేక ఆటుపోట్లు, నిర్బంధాన్ని ఎదుర్కొని తీవ్రంగా శ్రమించిన కాంగ్రెస్ నాయకులు, కేడర్ లో కూడా తాజాగా ఓ భరోసా కనిపిస్తోందీ. తమకు మంచి రోజులొస్తాయని భావిస్తున్నారు.

గ్రూపుల కాంగ్రెస్ లో సాధ్యమేనా?

గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మీనాక్షి మాట్లాడుతూ తనదైన పద్ధతిలో శ్రేణులకు సంకేతాలిచ్చింది. పదేండ్లు పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని తేల్చిచెప్పారు. తనతో పాటు ఏ నాయకుని మూటల మోయకుండా, పార్టీ కోసం పనిచేయాలని, కార్యకర్తలు, నాయకులు ఆత్మగౌరవంతో జీవించాలంటూ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ లక్ష్యం, పార్టీ విధానాలను అమలుచేసే వారికెప్పుడూ అన్యాయం జరుగదంటూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో శ్రేణుల్లో ఒకింత ఆశాభావ స్థితి నెలకొన్నప్పటికీ పార్టీలో నాయకులు, వ్యక్తుల ఆధిపత్యం, గ్రూపులు, అతిప్రజాస్వామ్యం, బహిరంగ విమర్శలు, అధిష్టానంతో లింకులు, ప్రత్యేక కోఠరీలు తదితర అనేక విషయాలు బహిరంగంగా కొనసాగే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ అమలు కావడం అంత సులువుమాత్రం కాదనే అభిప్రాయం మరో వైపు వ్యక్తమవుతోంది.

ఇంచార్జ్ ల మార్పులో అంతర్యమేమిటీ?

రాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా తమిళనాడుకు చెందిన మాణిక్కం ఠాగూర్ ను నియమించారు. కొద్దిరోజులకే ఆయనపై పార్టీలోని కొందరు నాయకులు బహిరంగ విమర్శలకు దిగారు. అప్పటి పీసీసీ అధ్య-క్షుడు రేవంత్ కు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు చేయడంతో అధిష్టానం ఆయనను తప్పించారు. ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన నారాయణ రాణే ఠాకూర్ ను నియమించారు. ఆయన నేతృత్వంలో కొంత సమన్వయం జరిగింది. భిన్నాభిప్రాయాలు కొనసాగాయి. బహిరంగంగా గ్రూపులు కొనసాగినప్పటికీ ఠాకూర్ కొంత సమన్వయంతో వ్యవహరించారు. మొత్తంగా కాంగ్రెస్ శ్రేణుల శ్రమ, వివిధ వర్గాల ప్రజల మద్ధతు, సామాజిక సంస్థల సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఠాకూర్ ను ఇంచార్జ్ స్థానం నుంచి తప్పించారు. ఆయన స్థానంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపా దాస్ మున్షీని నియమించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిన్నటి వరకు ఆమె ఇంచార్జ్ గా వ్యవహరించారు. కానీ, పార్టీలో ఆశించిన మార్పులు రాకపోగా అదనపు సమస్యలు పెరిగాయి. దీంతో అధిష్టానం మరోసారి ఇంచార్జ్ మార్పునకు శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్‌లో మీనాక్షి మార్కు ఉంటుందా?

మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌(Meenakshi Natarajan) ను ఇంచార్జ్ గా నియమించారు. రాహూల్ కోటరీలో కీలకమైన వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది. సాదాసీదా పద్ధతులతో ప్రత్యేకతను, పార్టీ కమిట్మెంటును కలిగి ఉంటారనే పేరుంది. తొలి సమావేశంతోనే ఆమె కొత్త ముద్ర వేసేందుకు ఆమె ప్రయత్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మార్పులు రాకుండా ఇంచార్జ్ ను మార్చడం వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరుతుందా? అనే వాదన ఉంది. ఇంచార్జ్ గా పార్టీని ఆమె గాఢీలో పెట్టే అవకాశముంటుంది తప్ప రాష్ట్ర ముఖ్య నాయకులను రోజువారీగా ముళ్ళుకర్రపెట్టి పొడవలేరుగదా? అని అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు మీనాక్షికి కూడా అగ్నిపరీక్షగానే భావిస్తున్నారు.

(రవి సంగోజు)