TPCC Chief Mahesh Kumar Goud: మంత్రులు పొంగులేటి..సీతక్కలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ !

విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వస్తుందంటూ కార్యకర్తల సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనపై పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. క్యాబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పొంగులేటిపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొక మంత్రి మాట్లాడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా ఏ ఒక్కరు కూడా అలాంటి ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేశారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని.. సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
కాగా స్థానిక ఎన్నికల అంశంపై మాట్లాడిన మరో మంత్రి సీతక్క మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై స్పందించారు. తాను కార్యకర్తల సమావేశంలో మాత్రమే వారిని సన్నద్దం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పడం జరిగిందన్నారు. అదికూడా స్థానిక ఎన్నికలపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని..నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేదన్నారు. దీనిపై మాట మార్చలేదన్నారు. మంత్రివర్గ సమావేశంలోనే స్థానిక ఎన్నికలపై స్పష్టత వస్తుందని తాను చెప్పానని గుర్తు చేశారు. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈనెలాఖరులో నోటిఫికేషన్ వస్తుందన్న మంత్రి పొంగులేటి మాత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై ఇప్పటికైతే స్పందించలేదు.