గత ప్రభుత్వ హాయంలోని తప్పులు చేయకండి: ఎమ్మెల్యే కూనంనేని

గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పులు చేయకుండా కొత్త ప్రభుత్వం జాగ్రత్త వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హితవు పలికారు

గత ప్రభుత్వ హాయంలోని తప్పులు చేయకండి: ఎమ్మెల్యే కూనంనేని
  • ప్రభుత్వానికి సీపీఐ హితవు
  • బీఆరెస్‌ పాలనపై చురకలు


విధాత: గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పులు చేయకుండా కొత్త ప్రభుత్వం జాగ్రత్త వహించాలని, ఇదే సమయంలో గత పాలకులు తమ ఓటమికి కారణాలపై విశ్లేషణ చేసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హితవు పలికారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం చర్చలో ఆయన మాట్లాడారు. బీఆరెస్‌ ఓటమికి ఎమ్మెల్యేల కొనుగోలు వంటి చర్యలతో పాటు ఎన్నికల హామీలను విస్మరించిందని అలాంటి తప్పులు ప్రస్తుత ప్రభుత్వం చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.


కూనంనేని ఈ సందర్భంగా బీఆరెస్‌ ఇంటికో ఉద్యోగం, దళితబంధు హామీలను ప్రస్తావించగా, హరీశ్‌రావు వాటిని తమ మ్యానిఫెస్టోలో పెట్టలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కూనంనేని గౌరవం కోల్పోకుండా మాట్లాడాలని సూచించారు. కూనంనేని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తప్పులను ఎత్తిచూపితే ఆత్మ విమర్శ చేసుకోకుండా తనపై విమర్శలు చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.


ఉద్యమ పార్టీగా బీఆరెస్‌ అధికారంలోకి వచ్చి ప్రజా ఉద్యమాలను అణిచివేసి స్వేచ్చను హరించి వేసిందని తప్పుబట్టారు. హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేయడంలో తప్పులేదని, ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామంటూ బీఆరెస్‌ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. గతంలో వైఎస్సార్ ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు పెద్ద విషయం కాదన్నారు. పేదలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.