కేసీ వేణుగోపాల్ ఫోన్ Komatireddy | విధాత : పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపయినర్, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలక పాన్పు ఎక్కారు. ఒకవైపు కాంగ్రెస్ టికెట్ల ఖరారుకు కసరత్తు సాగుతున్న తరుణంలో వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యవహారం ఆ పార్టీలో అలజడి రేపింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్‌తో కూడా ఆయన భేటీ కాలేదు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన […]
Komatireddy |
విధాత : పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపయినర్, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలక పాన్పు ఎక్కారు. ఒకవైపు కాంగ్రెస్ టికెట్ల ఖరారుకు కసరత్తు సాగుతున్న తరుణంలో వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యవహారం ఆ పార్టీలో అలజడి రేపింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్‌తో కూడా ఆయన భేటీ కాలేదు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌లు కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కోమటిరెడ్డి అలకకు కారణాలు తెలుసుకుని ఆయనను బుజ్జగించారు.
పార్టీలో ఆత్మగౌరవం లేకుండా కొనసాగాల్సివస్తుందంటూ, పార్టీలో ఇటీవల ప్రకటించిన సీడబ్ల్యుసీలో గాని, కేంద్ర ఎన్నికల కమిటీలోగాని, స్క్రీనింగ్ కమిటీలోగాని తనకు స్థానం దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని కోమటిరెడ్డి వాపోయినట్లుగా తెలుస్తుంది.
కాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తి సమాచారం తెలుసుకున్న ఏఐసీసీ సంస్థాగత సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించారని, తొందర పడవద్దని, మునుముందు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
కాగా వెంకట్‌రెడ్డితో భేటీ అనంతరం ఠాక్రే, భట్టిలు మాట్లాడుతూ వెంకట్‌రెడ్డి మా పార్టీ స్టార్ క్యాంపయినర్ అని, ఆయన మా పార్టీకి బలమైన నేత అని, చిన్నచిన్న మనస్పర్థలున్నా సర్ధుకుని పార్టీ విజయం కోసం ముందుకు సాగుతారన్నారు. ఆయన ఎలాంటి అసంతృప్తితో లేరని, ఆయన అందుబాటులో ఉండి లంచ్‌కు పిలువడంతో తామంతా ఇంటికి వచ్చామని, తమ లంచ్ చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు.