మునుగోడు: కమలం గూటిలో రాజుకున్న పంచాయతీ.. అధిష్టానం గుస్సా!
విధాత, నల్గొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయ సాధనకు ఎదురీదుతున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ అంతర్గత పరిణామాలు మింగుడు పడనివిగా మారాయి. పార్టీలోకి కొత్తగా చేరుతున్న వారికి, ఇప్పటికే ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న వారికి మధ్య నెలకొంటున్న పంచాయతీలు రాజగోపాల్ రెడ్డికి తలనొప్పిగా తయారయ్యాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి కొంత టీఆర్ఎస్ నుంచి, అధికంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో […]

విధాత, నల్గొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయ సాధనకు ఎదురీదుతున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ అంతర్గత పరిణామాలు మింగుడు పడనివిగా మారాయి. పార్టీలోకి కొత్తగా చేరుతున్న వారికి, ఇప్పటికే ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న వారికి మధ్య నెలకొంటున్న పంచాయతీలు రాజగోపాల్ రెడ్డికి తలనొప్పిగా తయారయ్యాయి.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి కొంత టీఆర్ఎస్ నుంచి, అధికంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం…పార్టీ బలోపేతం దిశగా ఆయన వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ కొత్తగా పార్టీలో చేరిన వారు తమపై ఆధిపత్యం చెలాయించాలని చూడటం సహించలేక పోతున్నామని పాత బీజేపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే అసమ్మతి వెళ్ళగక్కుతున్నారు.

తమ గ్రామాల్లో జరిగే బీజేపీ కార్యక్రమాలకు తమకు రాజగోపాల్ రెడ్డి వర్గం నుంచి సమాచారం ఇవ్వడం లేదని పాత బీజేపీ నాయకత్వం వాపోతుంది. సహజంగానే పాత బీజేపీ కేడర్‌కు.. కొత్తగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన వారికి ఇంతకాలం గ్రామాల్లో రాజకీయ వైరం ఉండనే ఉంది. వలసల సందర్భంగా వాటిని సర్దుబాటు చేయడంలో రాజగోపాల్ రెడ్డి వైఫల్యం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తుంది.
కొత్త వలసలతో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు రాజగోపాల్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై కూడా పాత బీజేపీ పాత కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీలోని పాత కొత్త పంచాయతీ కాస్త ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన బీజేపీ సంస్థాగత ఇంచార్జీ సునీల్ బన్సల్ దృష్టికి వెళ్ళడంతో ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకోవాలని ఆయన రాజగోపాల్ రెడ్డికి గట్టిగానే చెప్పినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

అదిగాక రాజగోపాల్ రెడ్డి బీజేపీ అధిష్టానంకు గతంలో చెప్పినట్లుగా కాంగ్రెస్ నుంచి ఆశించిన.. చెప్పుకోదగ్గ స్థాయి వలసలు లేకపోవడం పట్ల కూడా బీజేపీ అధిస్థానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కమలం వర్గాల కథనం. మునుగోడు నియోజకవర్గ పరిధిలో బీజేపీ అంచనాలకు తగ్గట్లుగా రాజగోపాల్ రెడ్డి ప్రజల్లోకి చొచ్చుకెళ్లలేక పోతున్నారని, కేవలం వలసల మీద ఆధార పడటం సరికాదని, స్థానిక ప్రజాప్రతినిధులు బీజేపీలోకి ఆర్ధిక, రాజకీయ సమీకరణల నేపథ్యంలో వచ్చినంత మాత్రాన వారి గ్రామాల్లోని ప్రజలు కూడా అదే దారిలో నడుస్తారని నమ్మడం కష్టమని అలాంటప్పుడు ప్రజల్లోకి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ అధిష్టానం తలపోస్తుంది.
ఈ దిశగా రాజగోపాల్ రెడ్డికి సునీల్ బన్సల్ కూడా మార్గదర్శకం చేశారని, అయినా పరిస్థితి మారకపోతే పాత కొత్త బీజేపీ నాయకుల రగడతో ఎన్నికల వేళ విజయావకాశాలు దెబ్బతీస్తాయన్న ఆందోళన కమలనాధులను పీడిస్తుంది. నియోజకవర్గ బీజేపీ పార్టీలోని అంతర్గత కలహాలు, ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకుల వలసలను త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ అధిష్ఠానం రాజగోపాల్ రెడ్డికి సూచించింది.
ఇందుకోసం మరి కొన్ని రోజులు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యం చేయవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అధిష్ఠానం సూచనల మేరకు పార్టీ అంతర్గత సమస్యల సర్దుబాటు, పార్టీ బలోపేతానికి రాజగోపాల్ రెడ్డి ముమ్ముర కసరత్తు చేస్తున్నా.. పాత కొత్త కేడర్ ఏకత్రాటి మీదకు రావడం అంత సులభంగా కనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.