Nalgonda | విప్లవాల ఖిల్లా.. నల్లగొండ జిల్లా! రాజకీయ మలుపుల ముఖ చిత్రం
Nalgonda నాడు కమ్యూనిస్టుల ఎర్రకోట.. మధ్యలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. నేడు బీఆర్ఎస్ గులాబీ కోట..!! ఆరు దశాబ్దాల ఎన్నికల రాజకీయ చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆదిలో కమ్యూనిస్టుల ఖిల్లాగా, అనంతరం కాంగ్రెస్ కంచుకోటగా నిలిచి.. ప్రస్తుతం మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాతినిథ్యంతో గులాబీ కోటగా మారిన వైనం.. జిల్లా ప్రజల రాజకీయ చైతన్యానికి, కాలానుగుణంగా మారుతూ వస్తున్న ప్రజా తీర్పునకు నిదర్శనంగా నిలిచింది. విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో […]

Nalgonda
- నాడు కమ్యూనిస్టుల ఎర్రకోట..
- మధ్యలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..
- నేడు బీఆర్ఎస్ గులాబీ కోట..!!
ఆరు దశాబ్దాల ఎన్నికల రాజకీయ చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆదిలో కమ్యూనిస్టుల ఖిల్లాగా, అనంతరం కాంగ్రెస్ కంచుకోటగా నిలిచి.. ప్రస్తుతం మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాతినిథ్యంతో గులాబీ కోటగా మారిన వైనం.. జిల్లా ప్రజల రాజకీయ చైతన్యానికి, కాలానుగుణంగా మారుతూ వస్తున్న ప్రజా తీర్పునకు నిదర్శనంగా నిలిచింది.
విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పిదప ప్రస్తుతం సూర్యాపేట, భువనగిరి, నల్లగొండ, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ , నాగార్జునసాగర్, మిర్యాలగూడ, అలేరు, తుంగతుర్తి (ఎస్సీ), నకిరేకల్ (ఎస్సీ), దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గాలున్నాయి.
నిజాంపై అద్వితీయ పోరాటం
నిజాం రాజు నిరంకుశ పాలనపై సాగించిన చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో జిల్లాలో పునాదులేసుకున్న కమ్యూనిస్టులు.. 1952, 1957 ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీ పేరుతో జిల్లాలోని అన్ని స్థానాల్లో ఘన విజయాలు సాధించారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో అటు నల్లగొండ పార్లమెంటు స్థానంలో గెలవడంతో పాటు, భువనగిరి శాససభ్యుడిగా ఎన్నికయ్యారు. 1957 ఎన్నికల్లో చిన్న కొండూరు (ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం)లో కాంగ్రెస్ నుండి కొండా లక్ష్మణ్ బాపూజీ మాత్రమే విజయం సాధించారు. 1962 ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో సీపీఐ, మూడు స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించాయి.
కాంగ్రెస్ హవా మొదలు
1967 ఎన్నికల్లో కాంగ్రెస్ బలం ఆ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థితో కలిపి తొమ్మిది స్థానాలకు పెరగగా, 1964లో సీపీఐఐ నుండి వేరుపడిన సీపీఐ (ఎం) మూడు స్థానాల్లో గెలుపొందింది. సీపీఐకి ఈ ఎన్నికల్లో తొలిసారిగా జిల్లా నుండి ప్రాతినిధ్యం దక్కలేదు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, కాంగ్రెస్ రెబల్స్ రెండు స్థానాల్లో, సీపీఐకి ఒక స్థానంలో విజయాలు దక్కాయి. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది, సీపీఎం మూడు, జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి.
టీడీపీ ప్రభంజనం ఆరంభం
అప్పటిదాకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ప్రతి ఎన్నికల్లోను నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల పోరు సాగేది. 1983 ఎన్నికల్లో టీడీపీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పుల క్రమంలో జిల్లాలో త్రిముఖ పోటీలకు తెరలేచింది.
ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు స్థానాలు, టీడీపీ నాలుగు, సీపీఎం రెండు, ఇండిపెండెంట్ (కాంగ్రెస్ రెబల్) ఒక స్థానంలో విజయం సాధించాయి. టీడీపీ ఆవిర్భావం పిదప ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వామపక్షాలు కాంగ్రెస్, టీడీపీలతో పోటీపడే స్థాయి నుండి తగ్గి, ఆ రెండింటిలో ఏదో ఒక పార్టీతో మిత్రపక్షంగా ఉండటం మొదలైంది.
1985 ఎన్నికల్లో మూడు చోట్ల పోటీ చేసిన ఎన్టీఆర్ నల్లగొండ అసెంబ్లీ స్థానం నుండి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే స్థానానికి పరిమితమైంది. టీడీపీ ఆరు స్థానాల్లో, మిత్రపక్షాలు సీపీఐ మూడు, సీపీఎం రెండు స్థానాలు దక్కించుకున్నాయి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు, టీడీపీ నాలుగు, సీపీఐ మూడు, సీపీఎం ఒకటి, ఇండిపెండెంట్ (టీడీపీ రెబల్) ఒక స్థానంలో గెలిచారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రుల మార్పు, అవినీతి ఆరోపణలతో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది.
పడి లేచిన కాంగ్రెస్
1994 ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ అనూహ్యంగా ఒక్క స్థానం కూడా గెలవకపోవడం సంచలనం రేపింది. తుంగతుర్తిలో కూడా దామోదర్ రెడ్డి మాత్రమే ఇండిపెండెంట్గా విజయం సాధించగా, ఐదు స్థానాల్లో టీడీపీ, మూడు చోట్ల సీసీఐ, మరో మూడు స్థానాలలో సీపీఎం గెలుపొందాయి.
రాష్ట్రంలో తిరిగి ఎన్టీఆర్ సారథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీలో చంద్రబాబు తిరుగుబాటు పిదప వచ్చిన 1999 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారం నిలబెట్టుకున్నప్పటికీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మళ్ళీ బలం పుంజుకొని తొమ్మిది స్థానాల్లో గెలిచింది. టిడిపి రెండు, సిపిఎం ఒక స్థానం గెలుపొందాయి.
ఖాతా తెరిచిన గులాబీ పార్టీ
2004 ఎన్నికల్లో రాష్ట్రంలో వైయస్సార్ సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, జిల్లాలో కాంగ్రెస్ ఆరు, మిత్రపక్షం సిపిఐ రెండు, సిపిఎం రెండు స్థానాలు గెలువగా, టీడిపి ఒక స్థానం గెలిచాయి. కాంగ్రెస్ మద్దతుతో ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తొలిసారిగా ఆలేరు స్థానంలో విజయం సాధించి జిల్లా నుండి అసెంబ్లీ స్థానాల విజయాల ఖాతా తెరిచింది. అప్పట్లో రాష్ట్ర సాధన ఉద్యమంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో జరిగిన ఆలేరు ఉప ఎన్నికల్లోను టిఆర్ఎస్ గెలుపొందడం విశేషం.
2009లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఆరు, మహాకూటమిగా జట్టు కట్టిన టిడిపి నాలుగు, సిపిఐ, సిపిఎంలు చెరొక స్థానం గెలవగా, ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ తమ ఏకైక ఆలేరు సిట్టింగ్ స్థానం కోల్పోయింది.
తెలంగాణ సెంటిమెంట్ లో కొట్టుకుపోయిన టిడిపి.. టిఆర్ఎస్ దాటికి కాంగ్రెస్, కామ్రేడ్ల సీట్ల గల్లంతు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిదప జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు, టిఆర్ఎస్ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ ఒక స్థానంలో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో టిడిపి ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడంతో ఆ పార్టీ ఆవిర్భావం నుండి మూడు దశాబ్దాల అనంతరం జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రభావం.. రాష్ట్ర విభజనపై టిడిపి పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో ప్రజాధరణ కోల్పోయి జిల్లాలో నామా మాత్రమైంది.
ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కరరావు, దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే ఆర్.రవీంద్ర కుమార్ లు టిఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో జిల్లాలో సిపిఐ సైతం అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అదే సమయంలో తెలంగాణ సాధించిన పార్టీగా బిఆర్ఎస్ (బిఆర్ఎస్) పుంజుకోవడంతో జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మధ్య ముఖాముఖి పోటీ మొదలైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో, టిఆర్ఎస్ తొమ్మిది స్థానాలలో గెలుపొందాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఉద్దండ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలు ఓడిపోయారు. గెలిచిన నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరిపోయారు. నల్గొండ ఎంపీగా గెలిచిన ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పద్మావతి ఓడిపోగా, టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం తిరిగి నిలబెట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం టిఆర్ఎస్ పార్టీకి కోల్పోవడంతో జిల్లాలో ప్రస్తుతం మొత్తం 12 స్థానాల్లోనూ టిఆర్ఎస్(బిఆర్ఎస్) ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదట కమ్యూనిస్టుల ఖిల్లాగా, తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా కొనసాగి, ఇప్పుడు గులాబీ కోటగా మారిపోయినట్లయింది. ఆరు దశాబ్దాల కాలంలో జిల్లా రాజకీయాలను శాసించిన కమ్యూనిస్టులకు, కాంగ్రెస్, టీడీపీలకు ప్రస్తుతం జిల్లా నుండి శాససభకు ప్రాతినిధ్యం లేకుండా పోవడం గమనార్హం.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బలం పుంజుకోవడానికి కాంగ్రెస్ సీనీయర్లు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. పొత్తుల ఎత్తులతో మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు వామపక్షాలు కొడవళ్లకు పదును పెడుతున్నాయి. గులాబీ కోటలో ఒక్క సీటు కూడా చేజార్చుకోవద్దన్న లక్ష్యంతో బిఆర్ఎస్ పార్టీ పట్టుదలగా సాగుతుంది.
ఉద్దండుల జిల్లాగా ఖ్యాతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన జిల్లా నేతలందరూ చట్టసభల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. 1952లో తెలంగాణ సాయుధ పోరాట నేత కామ్రేడ్ రావి నారాయణరెడ్డి నల్లగొండ ఎంపీగా ఆనాటి ప్రధాని నెహ్రూ కంటే అధిక మెజారిటీతో విజయం సాధించడం తో పాటు, భువనగిరి నుండి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి-కమలాదేవి దంపతులు 1962లో భువనగిరి, ఆలేరుల నుండి ఒకేసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
కమలాదేవి ఆలేరులో 1952,1957,1962 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. రామన్నపేటలో ఇదే రీతిలో కమ్యూనిస్టు నేత కే. రామచంద్రారెడ్డి సైతం హ్యాట్రిక్ విజయాలు సాధించారు. తదుపరి ఇదే స్థానంలో సిపిఐ ఎమ్మెల్యేగా గుర్రం యాదగిరి రెడ్డి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కాంగ్రెస్ నుండి తిప్పన చిన్న కృష్ణారెడ్డి, చలకుర్తిలో నిమ్మల రాములు హ్యాటిక్ విజయాలు సాధించారు.
హ్యాట్రిక్ విజేతలలో కుందూరు జానారెడ్డి ఐదు సార్లు చలకుర్తిలో, రెండుసార్లు నాగార్జునసాగర్ లో విజయాలు సాధించారు. దేవరకొండలో సిపిఐ నేత బద్దు చౌహన్, మునుగోడులో ఉజ్జిని నారాయణరావులు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. హ్యాట్రిక్ విజేతలైన ఎలిమినేటి మాధవరెడ్డి భువనగిరిలో వరుసగా నాలుగు విజయాలు, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఉప ఎన్నికతో కలిపి వరుసగా మూడు విజయాలు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ లో వరుసగ మూడు సార్లు, కోదాడలో రెండు సార్లు గెలుపొందారు.
తుంగతుర్తిలో ఆర్. దామోదర్ రెడ్డి తుంగతుర్తి నుండి నాలుగు సార్లు, సూర్యాపేట నుండి ఒకసారి గెలిచారు. మోత్కుపల్లి నరసింహులు అలేరులో వరుసగా ఐదు విజయాలు, ఇంకోసారి తుంగతుర్తిలో మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సిపిఎం నేత నర్రా రాఘవరెడ్డి నకిరేకల్ లో వరుసగా ఐదు విజయాలతో మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకసారి చిన్న కొండూరు నియోజకవర్గంలో, రెండుసార్లు భువనగిరిలో విజయం సాధించి, దామోదరం సంజీవయ్య, కాసు మంత్రివర్గాల్లో పనిచేశారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవి త్యాగం చేశారు. పాత హుజూర్నగర్ లో రెండుసార్లు గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు సైతం కాసు , పివి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేసి నక్సలైట్ల దాడిలో హతులయ్యారు.
మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 16 సంవత్సరాల నాలుగు నెలల 19 రోజులపాటు కే. జానారెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆయన టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ నుండి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా భవనం వెంకట్రామిరెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
రామన్నపేట నియోజకవర్గం నుండి గెలిచిన కొమ్ము పాపయ్య టి.అంజయ్య మంత్రివర్గంలో పనిచేయగా, కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సైతం కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో పనిచేశారు. సిపిఐ, సిపిఎం దిగ్గజనేతలు బి. ధర్మభిక్షం నకిరేకల్, నల్లగొండ, సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన రెండుసార్లు లోక్ సభకు కూడా ప్రాతినిధ్యం వహించారు.
సిపిఎం నేతలు భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యంలు, కాంగ్రెస్ నేతలు వడ్డేపల్లి కాశీరాం రెండు సార్లు అసెంబ్లీకి, ఒక సారి పార్లమెంట్ కు, చకిలం శ్రీనివాసరావు మూడూ సార్లు అసెంబ్లీకి, ఒకసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ నుండి 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి కేసిఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లోను కమ్యూనిస్టుల కాంగ్రెస్ ల ముఖాముఖి
పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి( పాత మిర్యాలగూడ) పార్లమెంటు నియోజకవర్గాలలో 1952 నుంచి జరుగుతూ వస్తున్న ఎన్నికల్లో కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య గెలుపు ఓటములు మారుతూ వచ్చాయి. నల్లగొండ లోక్ సభ స్థానంలో వామపక్షాలు ఏడు పర్యాయాలు, కాంగ్రెస్ ఏడు పర్యాయాలు గెలిచాయి.
తెలంగాణ ప్రజా సమితి ఒకసారి, టిడిపి రెండుసార్లు గెలిచింది. నల్గొండ ఎంపీగా రెండుసార్లు నెగ్గిన వారిలో రావి నారాయణరెడ్డి, దర్మభిక్షం, సురవరం సుధాకర్ రెడ్డిలు, మూడు పర్యాయాలు సుఖేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ కృష్ణానది జలాలను శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు తరలించాలని కోరుతూ జల సాధన సమితి, ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు స్థానంలో 682 మంది నామినేషన్లు దాఖలు చేసి సంచలనం సృష్టించారు. వాటిలో 201 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 401 నామినేషన్లు ఆమోదించబడ్డాయి. దీంతో దేశ ఎన్నికల చరిత్రలో అతి పెద్ద బ్యాలెట్ పేపర్ తో పోలింగ్ నిర్వహించడం విశేషం.
భువనగిరి లోక్ సభ స్థానంలో 1962 నుండి 15 సార్లు ఎన్నికలవ్వగా పదిసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు కమ్యూనిస్టులు, ఒకసారి టిఆర్ఎస్ గెలుపొందింది. పాత మిర్యాలగూడ( భువనగిరి) స్ధానంలో కాంగ్రెస్ నుండి జి.ఎస్.రెడ్డి, బద్దం నరసింహారెడ్డిలు మూడు పర్యాయాల చొప్పున, సూదిని జైపాల్ రెడ్డి రెండు పర్యాయాలు, భీంరెడ్డి నరసింహారెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందారు.
ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా బలహీనపడి ఉనికి కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులు పార్లమెంట్ స్థానాల్లోనూ సొంతంగా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం రెండు పార్లమెంటు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎంపీలు గా ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.