బెన్నూ మట్టిలో కార్బన్.. సైన్స్ మొత్తాన్ని తిరగరాయాల్సిందేనా?
సౌర కుటుంబం పుట్టు పూర్వోత్తరాల కోసం బెన్ను(Bennu) అనే ఆస్టరాయిడ్ నుంచి నాసా మట్టిని సేకరించిన విషయం తెలిసిందే.

సౌర కుటుంబం (Solar System) పుట్టు పూర్వోత్తరాల కోసం బెన్ను(Bennu) అనే ఆస్టరాయిడ్ నుంచి నాసా (NASA) మట్టిని సేకరించిన విషయం తెలిసిందే. అందులో బయటపడిన ఒక పదార్థం శాస్త్రవేత్తలను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ వారం మొదట్లో సమావేశమైన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ (ఏజీయూ) ఈ పదార్థంపై చర్చించింది. అందులో భాగంగా పరిశోధకులు తాము బెన్నూ మట్టిలో కార్బన్ ను కలిగిన మూలకాలను కనుగొన్నట్లు తెలిపారు.
జీవం ఉద్భవించడానికి, సారవంతమైన మూలకాలు రూపొందడానికి మట్టిలో కార్బన్ ఉండటం ముఖ్యం కావడంతో.. సౌర కుటుంబం తొలినాళ్లలోనే జీవం ఉనికికి కావాల్సిన పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమనుకుంటే మన పాలపుంత గురించి, భూమి గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం అనుకున్నదంతా తప్పే అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మట్టిని మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉందని అన్నారు.
సౌరకుటుంబం తొలి రోజుల నాటి మట్టి పదార్థాన్ని కనుగొనాలన్న తమ ఆశయం బెన్నూ మట్టి తీసుకురావడంతో నెరవేరిందని యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో ప్లానెటరీ సైన్స్ అండ్ కాస్మో కెమిస్ట్రీ ప్రొఫెసర్ లారెటా అన్నారు. ఈ మట్టి ఎంతో సారవంతంగా, మూలకాలతో నిండి ఉందని పేర్కొన్నారు. 300 కోట్ల నాటి ఈ ఆస్టరాయిడ్ నుంచి నాసా ఉపగ్రహం 150 గ్రాముల రాయిని తీసుకురాగా శాస్త్రవేత్తలు ఇప్పటికి 70.3 గ్రాముల మట్టిని మాత్రమే పరిశీలించారు.
ఇంకా 70 గ్రాముల మట్టిని వివిధ అవసరాల కోసం పరిశోధన చేయాల్సి ఉంది. ఈ మట్టి కణాలు చాలా ముదురు రంగులో ఉండి సెం.మీ నుంచి మి.మీ. పరిమాణంలో ఉన్నాయని తెలుస్తోంది. ఒక కాలీ ఫ్లవర్ ఉపరితలం ఎలా ఉందో.. ఈ మట్టిని తాకితే అలానే ఉందని దానిని ముట్టుకున్న వారు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం.. ఈ మట్టి నమూనాలో 4.7 శాతం కార్బన్ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇందులో తెల్లగా ఉన్న చిన్న చిన్న అణువులను కాల్షియం కార్బొనేట్ లేదా లైమ్‌స్టోన్‌గా భావిస్తున్నారు. అయితే వీటిపై కాంతిని ప్రసరించి చూడగా అవి వెలుగును పరావర్తనం చెందిస్తున్నాయి. కాల్షియం కార్బొనేట్‌కు అలాంటి లక్షణం ఉండదు కాబట్టి ఇది ఏదో పదార్థం అయి ఉంటుందని భావిస్తున్నారు.