నాసా ప్ర‌యోగాలు మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం..

నాసా భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌నున్న మూన్ మిష‌న్లు మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం

  • By: Somu    latest    Jan 10, 2024 10:04 AM IST
నాసా ప్ర‌యోగాలు మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం..

నాసా (NASA) భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌నున్న మూన్ మిష‌న్లు (Moon Missions) మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మ‌చారం. 50 ఏళ్ల త‌ర్వాత చంద్రునిపైకి ల్యాండ‌ర్ పంపాల‌ని అమెరికా చేప‌ట్టిన ప్ర‌యోగం విఫ‌లం కావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పెరిగ్రిన్ అనే ల్యాండ‌ర్‌ను తీసుకెళుతున్న అధునాత‌న రాకెట్‌.. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల త‌గినంత ప్రొప‌ల్ష‌న్‌ను ఉత్ప‌త్తి చేయ‌లేక‌పోవ‌డంతో విఫ‌ల‌మైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌భావంతో 2024లో ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌ర‌గాల్సి ఉన్న మూన్ మిష‌న్‌లు అన్నీ ఆల‌స్య‌మ‌వుతాయ‌ని ఒక నివేదిక వెల్ల‌డించింది.


వ‌చ్చే మంగ‌ళ‌వారం నాడు నాసా త‌న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళికపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశ‌ముంది. కాగా ఆర్టిమిస్ ప్ర‌యోగంతో చంద్రునిపైకి మ‌నుషుల‌ను పంపాల‌ని నాసా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. 1972లో అపోలో ద్వారా మాన‌వ స‌హిత యాత్ర‌ను చేప‌ట్టిన త‌ర్వాత నాసా మ‌రోసారి చంద్రునిపైకి వ్యోమ‌గాముల‌ను పంప‌లేదు. వేల కోట్ల డాల‌ర్ల విలువైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి నాసా ఇప్పటికే అనేక ప్ర‌క్రియ‌ల‌ను పూర్తి చేసింది. అయితే ఈ మిష‌న్‌లో కొన్ని బాధ్య‌త‌ల‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించ‌డంతో.. వారు చేసే జాప్యం మిష‌న్‌పై ప్ర‌భావం చూపిస్తోంది.


అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే 2024 ద్వితీయార్థంలో ఆర్టిమిస్ 2ను నాసా చేప‌ట్టాల్సి ఉంది. అయితే దానికి కావాల్సిన వ్యోమ‌నౌక ఓరియాన్‌లో క్రూ మాడ్యుల్‌కు సంబంధించి లోపాల‌ను గుర్తించారు. బ్యాట‌రీ వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు చేయాల్సి ఉంద‌ని నిర్ణ‌యించ‌డంతో ప్ర‌యోగం వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ బ్యాట‌రీ వ్య‌వ‌స్త‌ను ప్ర‌ముఖ డిఫెన్స్ కంపెనీ అయిన లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించింది. మ‌ర‌లా ఆ బ్యాట‌రీల‌ను స‌రిచేయ‌డం, వాటికి వైబ్రేట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాతే ఈ ప్ర‌యోగానికి గ్రీన్‌సిగ్నల్ ప‌డుతుంది.


ఆర్టిమిస్ 2 త‌ర్వాత 2025లో చేప‌ట్టే ఆర్టిమిస్ 3లో వ్యోమ‌గాముల‌ను చంద్రునిపైకి పంపాల‌ని నాసా ప్ర‌ణాళిక‌. ఈ ల్యాండింగ్‌కు కావాల్సిన సాంకేతిక‌త‌ను ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆ సంస్థ డెడ్‌లైన్ల‌లోపు ప‌నుల‌ను చేప‌ట్ట‌లేక‌పోతోంద‌ని వెల్ల‌డైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నాసా ఈ ఆల‌స్యాల‌పై ఎటువంటి స్పంద‌న‌నూ తెలియ‌జేయ‌లేదు. అయితే నాసా ప్ర‌క‌టించే కొత్త డేట్ల‌లో ప్ర‌యోగాలు జ‌రుగుతాయా లేదా అనేది నాసా మీద కంటే ప్రైవేటు కంపెనీల‌పైనే ఎక్కువ ఆధార‌ప‌డి ఉంద‌ని సంబంధిత వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డ్డాయి.