• Telugu News
  • /Latest

చలిగుప్పిట ఉత్తర భారతం.. ఢిల్లీని కమ్మిన పొగమంచు..!

ఉత్తర భారతం చలితో గజగజ వణుకుతున్నది. చలికి తోడు దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది

Reported by: Somu | latest | Dec 29, 2023, 9:45 am IST
Read Time: 4 mins
చలిగుప్పిట ఉత్తర భారతం.. ఢిల్లీని కమ్మిన పొగమంచు..!

Weather Report | ఉత్తర భారతం చలితో గజగజ వణుకుతున్నది. చలికి తోడు దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. ఫలితంగా వాహనదారులు, జనంపై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ వరకు చలి చంపేస్తున్నది. పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నది.


దట్టంగా ఆవరిస్తున్న పొగతో రోడ్లపై వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంటున్నది. అలాగే విమానాలు, రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఢిల్లీలో 80కిపైగా రైళ్లు నాలుగు నుంచి 13 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 271 విమానాలు ప్రభావితమవగా.. ఇందులో పలు విమానాలు రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. 41 అంతర్జాతీయ, 150 దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి.


మరింత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు..


మరో వైపు నేటి నుంచి ఢిల్లీలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని పేర్కొంది. ఢిల్లీ వైపు శీతలగాలులు వీస్తున్నాయని.. ఫలితంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని పేర్కొంది. శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది.


పంజాబ్‌, హర్యానా, యూపీ, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 2 వరకు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కొండ ప్రాంతాల్లో మినహా చాలా రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8-12 డిగ్రీల మధ్య ఉంటాయని తెలిపింది. ఈ నెల 30 వరకు పొగమంచు కొనసాగుతుందని పేర్కొంది.


ప్రయాణికుల పాట్లు..


పొగ మంచు కారణంగా ఢిల్లీలో విమానాలు, రైలు సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చలిలోనే రైల్వే ప్లాట్‌ఫామల వద్దనే ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. దాదాపు రైళ్లు నాలుగు నుంచి 13 గంటలు ఆలస్యంగా ఉన్నాయి. ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులుపడుతున్నారు. అలాగే, ఎయిర్‌ పోర్టుల్లోనే ప్రయాణికులు కాలం గడుపాల్సి దుస్థితి నెలకొన్నది.