‘NTR Baby Kits’| ఏపీలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

అమరావతి : ఏపీలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన వారికి ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ అందచేయాలని సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కిట్ల పంపిణీ టెండర్ల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు-మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించారు. అర్హత కలిగిన తయారీదారులు, అధికారిక డిస్ట్రిబ్యూటర్లు ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బిడ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ నెల 21న టెక్నికల్ బిడ్లు డౌన్‌లోడ్ చేయనున్నారు. ఆ తర్వాత అర్హత కలిగిన వారి ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేస్తారు. బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు టెండర్లలో అవకాశం ఉండదని..సామర్థ్యం లేని సంస్థలను టెక్నికల్ స్క్రీనింగ్ ప్రక్రియతో వడపోత చేస్తామని తెలిపింది.
శిశు ఆరోగ్య సంరక్షణ కోసం 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. అయితే మళ్లీ ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ పేరుతో ఆ పథకాన్ని పునఃప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీటు, దుస్తులు, నాప్కిన్లు, తువ్వాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ వంటి 11 వస్తువులు ఉంటాయి. 26 జిల్లాల్లోని డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, జీజీహెచ్‌లకు రెండేళ్ల పాటు ‘రేట్ కాంట్రాక్ట్’ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేలా టెండర్లు పిలిచారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.