OceanGate | శుక్రుడిపై త్వరలోనే మానవ సమాజాలు.. ఓషన్ గేట్స్ సంస్థ సంచలన ప్రకటన
OceanGate టైటానిక్ దగ్గరకి వెళ్తున్న టైటాన్ మినీ జలాంతర్గామి పేలిపోయి అయిదుగురిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ ఘటనతో ఆ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్‌గేట్ (Ocean Gate) సంస్థ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ సంస్థ సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుందని పలువురు నిపుణులు విమర్శలు గుప్పించారు. తాజాగా అదే ఓషన్ గేట్ సంస్థ మరో సంచలన ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులోనే శుక్ర […]

OceanGate
టైటానిక్ దగ్గరకి వెళ్తున్న టైటాన్ మినీ జలాంతర్గామి పేలిపోయి అయిదుగురిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ ఘటనతో ఆ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్‌గేట్ (Ocean Gate) సంస్థ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ సంస్థ సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుందని పలువురు నిపుణులు విమర్శలు గుప్పించారు.
తాజాగా అదే ఓషన్ గేట్ సంస్థ మరో సంచలన ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులోనే శుక్ర (Venus) గ్రహంపై మానవ నివాసాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. హ్యూమన్స్2వీనస్ అనే ప్రత్యేకమైన వెంచర్‌ను దీని కోసం ఓషన్‌గేట్ సంస్థ స్థాపించింది. ఈ వెంచర్ ద్వారా పెట్టుబడులను సేకరించి 2050కల్లా వీనస్‌పై మానవ సమాజాన్ని (Human Colony) ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించింది.
సాధ్యమేనా …?
అయితే వీనస్‌పై పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయి. అతి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షాలు మొదలైన వాటితో శుక్రుడు ప్రత్యక్ష నరకానికి నకలుగా ఉంటాడు. అయితే శుక్రుడి ఉపరితలంపై కాకుండా.. గాలిలో తేలే నివాసాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఓషన్‌గేట్స్ వ్యవస్థాపకుడు గ్యులెరెమో సోనలిన్ వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం.. శుక్రుడి ఉపరితలానికి 48 కి.మీ. (30 మైళ్లు) ఎత్తులో ఉష్ణోగ్రత, పీడనం మానవ జీవనానికి సరిపడేలా ఉంటాయని భావిస్తున్నారు.
ఇక్కడ ఎగిరే కాలనీని నిర్మించడం ద్వారా మానవ నివాసాలు ఏర్పాటు చేయడమే హ్యూమన్స్2 వీనస్ ప్రాజెక్టు ఉద్దేశం. దీనికి తగిన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పలు సవాళ్లతో కూడుకున్నదే. అయినప్పటికీ 2050 కల్లా లక్ష మందిని మార్స్ (Mars) మీదకు పంపే ప్రాజెక్టు కన్నా వీనస్ ప్రాజెక్టుకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని గ్యులెరెమో విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇక మనుషుల్ని ముందుగా ఆహ్వానించేది శుక్రుడా లేక అంగారకుడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.