Odisha | ఆ స్కూల్లో అడుగుపెట్టాలంటే భయపడుతున్న విద్యార్థులు..!
Odisha | ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బహనాగ ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. అసలు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లడానికి కూడా సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఇటీవల బహానాగ రైల్వే స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వందలాది మంది మృతదేహాలను ఆ పాఠశాలలోనే కొద్ది రోజుల పాటు ఉంచారు. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న ఆ మృతదేహాలను చూసి పిల్లలు భయ పడిపోయారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆ పాఠశాల […]

Odisha | ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బహనాగ ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. అసలు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లడానికి కూడా సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఇటీవల బహానాగ రైల్వే స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వందలాది మంది మృతదేహాలను ఆ పాఠశాలలోనే కొద్ది రోజుల పాటు ఉంచారు.
కుప్పలు తెప్పలుగా పడి ఉన్న ఆ మృతదేహాలను చూసి పిల్లలు భయ పడిపోయారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆ పాఠశాల ఆవరణలోకి పంపేందుకు ధైర్యం చేయడం లేదు. ఈ అంశం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
దీంతో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. నిన్న బహానాగ పాఠశాలను కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సందర్శించారు. స్కూల్ మేనెజ్‌మెంట్ కమిటీ, ప్రధానోపాధ్యాయురాలు, ఇతర సిబ్బంది, స్థానికులతో సమావేశం నిర్వహించారు.
నాలుగైదు రోజుల పాటు శవాలతో పాఠశాల నిండిపోయింది. దీంతో ఆ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు భయపడి పోతున్నారని తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు శవాలను ఉంచిన తరగతి గదులను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరగతి గదులు కూడా పాత భవనాలు కావడంతో, వాటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.