Odisha Govt | మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం

దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త అందించింది. మహిళా ఉద్యోగినిలకు ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది

  • By: Subbu |    national |    Published on : Aug 15, 2024 8:17 PM IST
Odisha Govt | మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం

విధాత : దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త అందించింది. మహిళా ఉద్యోగినిలకు ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కటక్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం పార్వతి పరీదా ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవు ను తీసుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తోంది. ఇక, కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు మూడు రోజుల నెలసరి సెలవులను ప్రకటించింది. అనంతరం హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, అస్సోంలోని గుహవాటి విశ్వవిద్యాలయం. తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయం, చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీలు సైతం తమ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించడం గమనార్హం.

మహిళలకు నెలసరి సెలవులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళలకు మూడు రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలంటూ 2022లో పార్లమెంటులో ఓ బిల్లును ప్రతిపాదించినప్పటికీ ఇప్పటికీ దానికి ఆమోదముద్ర పడలేదు. మరోవైపు, ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. “మహిళలకు నెలసరి సెలవులు ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రోత్సహించినట్లు అవుతుందని, అయితే, వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చని, మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గొచ్చని, అది మేం కోరుకోవట్లేదని, మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారొచ్చని కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.