Omar Abdullah | కేజ్రీవాల్ అప్పుడు ఎక్కడ? 370 రద్దు సమయంలో మాట్లాడలేదే?: ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah ఆనాడు ప్రజాస్వామ్యం హత్యకు గురైంది ఆ సమయంలో బీజేపీ పక్షాన ఆప్ నేతలు ఇప్పుడు ఇబ్బందిలో అరవింద్ కేజ్రీవాల్ అందుకే విపక్షాల మద్దతు కోరుతున్నారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్: ఢిల్లీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుస్తున్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా […]

Omar Abdullah
- ఆనాడు ప్రజాస్వామ్యం హత్యకు గురైంది
- ఆ సమయంలో బీజేపీ పక్షాన ఆప్ నేతలు
- ఇప్పుడు ఇబ్బందిలో అరవింద్ కేజ్రీవాల్
- అందుకే విపక్షాల మద్దతు కోరుతున్నారు
- జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: ఢిల్లీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుస్తున్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చురకలు అంటించారు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించేందుకు ఉద్దేశించిన 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కేజ్రీవాల్ దానిని సమర్థించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ.. ఈ రోజు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నారని విమర్శించారు. ‘వారికి మేం కావాల్సి వచ్చినప్పడు మా తలుపు తడతారు.
ఇప్పుడు కేజ్రీవాల్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయనకు మా మద్దతు కావాలి. కానీ.. 2019లో వారు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గొంతు చించుకుంటున్నవారు ఆ రోజు ప్రజాస్వామ్యం హత్యకు గురైన రోజు ఎక్కడ ఉన్నారు? కనీసం మాట్లాడలేదు. పైగా వారు దానిని సమర్థించారు’ అని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ఆర్డినెన్స్‌ను ఆనాడే ఖండించిన ఒమర్
ఢిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్రం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తెచ్చినప్పుడే ఒమర్ అబ్దుల్లా దానిని ఖండించారు. కేంద్ర ప్రభుత్వ చర్య సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. కానీ.. శనివారం మీడియాతో మాట్లాడుతూ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి మొట్టికాయలు వేశారు. ‘కోళ్లు ఇప్పుడు ఇంటికి వచ్చాయి’ అని ఎద్దేవా చేశారు. 2019లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన సమయంలో బీజేపీ పక్షాన చేరిన ఆ పార్టీ.. జరుగబోయే ప్రమాదాన్ని గుర్తించకపోవడం సిగ్గుచేటని అన్నారు.
విపక్షాలతో జట్టుకట్టం
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టేది లేదని ఒమర్ అబ్దుల్లా తేల్చి చెప్పారు. 370 ఆర్టికల్ రద్దు సమయంలో చాలా విపక్ష పార్టీలు మౌనంగా ఉండిపోయాయని ఆయన విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో ఐదు లోక్‌సభ సీట్లు ఉన్నాయని, వీటిలో తామే బీజేపీపై పోరాడుతామని చెప్పారు. ఇక జమ్ముకశ్మీర్ బయట ఏం జరుగుతుందనేది తర్వాతి అంశమని అన్నారు.
విపక్షాల కూటమితో జమ్ముకశ్మీర్‌లో ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు కూటమిని ఏర్పాటు చేసే విషయంలో ప్రశ్నించగా.. ముందు ఎన్నికల ప్రకటన రానీయండి.. అప్పుడు అందరం కూర్చొని చర్చిస్తాం.. అని తెలిపారు.