వేయి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థయాత్రలకుపోయినట్లుగా..
వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థ యాత్రలకు పోయినట్లుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైఖరి ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అన్నారు

- ఎమ్మెల్సీ కవిత వైఖరిపై మండిపడ్డ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
విధాత: వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థ యాత్రలకు పోయినట్లుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైఖరి ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్‌లోఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో పాలకుర్తి, వర్ధన్న పేట నియోజక వర్గాల చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కూతురు కవిత ధర్నా చౌక్ వద్ద శివరాత్రి రోజున చేసిన ధర్నా చేసిందని, ఆమె వైఖరి చూస్తే నవ్వొస్తుందన్నారు. ఇంతకాలం పక్కన పెట్టిన జాగృతిని మళ్ళీ తెరిచిందన్నారు. తెలంగాణ జాగృతి పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వం లో ఏనాడైనా మహిళల గురించి మాట్లాడారా అని అడిగారు. అధికారంలో ఉండగా కవితకు ఎనాడూ గుర్తుకు రాని మహిళలు పదవి పోగానే గుర్తుకు వచ్చారా అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట మహిళల కోసమే ఉచిత ఉచిత బస్ సౌకర్యం అమలు చేసిందన్నారు. అలాగే మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ పథకం, ఉచిత గృహ విద్యుత్తో పాటు అన్ని పథకాలు మహిళ కోసమే అమలు చేశామన్నారు. కవిత మహిళల కోసం ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ లో పెద్దఎత్తున చేరుతున్న వారందరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు నెలలుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి స్పందన కలిగిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందన్నారు. ఎవరికి ఏ స్థాయి లో ప్రాధాన్యత ఇవ్వాలో అలాగే ఇస్తామన్నారు. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పని చేసి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.