పాలేరు నుంచి బరిలో మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి..?
విధాత: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన సంగతి విదితమే. ఆయన స్థానంలో అంజనీకుమార్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే పదవీ విరమణ తర్వాత మహేందర్ రెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తుందని, ఆయన సేవలను వినియోగించు కుంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఐఏఎస్ సర్వీస్‌కు వలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లెక్కనే మహేందర్‌రెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. మహేందర్‌రెడ్డి […]

విధాత: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన సంగతి విదితమే. ఆయన స్థానంలో అంజనీకుమార్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే పదవీ విరమణ తర్వాత మహేందర్ రెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తుందని, ఆయన సేవలను వినియోగించు కుంటుందనే వార్తలు వస్తున్నాయి.
అయితే ఐఏఎస్ సర్వీస్‌కు వలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లెక్కనే మహేందర్‌రెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. మహేందర్‌రెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా, మధిర మండలం, కిష్టాపురం గ్రామం. దీంతో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతున్నది.
దీనిపై ఇప్పటివరకు అధికార పార్టీ నుంచి గానీ ఆయన నుంచి గానీ ఎలాంటి సిగ్నల్స్ లేవు. కానీ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కూడా వెంటట్రామిరెడ్డి వలె కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విపక్ష నేతల విమర్శలు ఎదుర్కొంటున్న కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.
పాలేరు నియోజకవర్గం నుంచి మహేందర్‌రెడ్డి బరిలో ఉండొచ్చు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ సారాంశం. ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అనేది కొత్త ఏడాదిలో తేలుతుంది. పాలేరు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని వైఎస్‌ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల తనను ఆశ్వీర్వదించాలని అక్కడి ప్రజలను బహిరంగ సభ వేదిక ద్వారా కోరిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్న ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అనేక కొత్త అభ్యర్థుల పేర్లు తెరమీదికి వస్తున్నాయి.