భార్య బంగారం తాకట్టుపెట్టి.. నదిపై బ్రిడ్జి నిర్మించాడు
Odisha | భార్య బంగారం తాకట్టు పెట్టి.. నదిపై బ్రిడ్జి నిర్మించడం ఏంటని అనుకుంటున్నారా? అవునండి మీరు చదువుతున్నది నిజమే. ఎందుకంటే.. బ్రిడ్జి నిర్మించాలని అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. ఆ గ్రామ ప్రజల బాధలను ఆలకించలేదు. హామీలన్నీ నీటి మీద రాతల్లాగా మిగిలిపోయాయి. దీంతో అత్యవసరం సమయంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను చూసిన ఓ యువకుడు చలించిపోయాడు. తనకున్న ఉపాధిని వదులుకోని, భార్య బంగారం […]

Odisha | భార్య బంగారం తాకట్టు పెట్టి.. నదిపై బ్రిడ్జి నిర్మించడం ఏంటని అనుకుంటున్నారా? అవునండి మీరు చదువుతున్నది నిజమే. ఎందుకంటే.. బ్రిడ్జి నిర్మించాలని అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. ఆ గ్రామ ప్రజల బాధలను ఆలకించలేదు. హామీలన్నీ నీటి మీద రాతల్లాగా మిగిలిపోయాయి. దీంతో అత్యవసరం సమయంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను చూసిన ఓ యువకుడు చలించిపోయాడు. తనకున్న ఉపాధిని వదులుకోని, భార్య బంగారం తాకట్టు పెట్టి.. బ్రిడ్జి నిర్మించాడు. ఇందుకు అతని తండ్రి కూడా సహకరించాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని రాయగడ జిల్లా పరిధిలోని గుంజరం పంజర గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ వృత్తి రీత్యా డ్రైవర్. తమ గ్రామ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలంటే బిచ్చాలా నది దాటి వెళ్లాలి. దీంతో 120 కుటుంబాలు ఉన్న ఆ గ్రామానికి నదిపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులు వినతులు సమర్పించారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు. దీంతో అత్యవసర సమయంలో వైద్యం అందక చాలా మంది చనిపోయారు. గ్రామ ప్రజలు చనిపోవడం, చిన్నారులు వృద్ధులు నది దాటలేక పడుతున్న అవస్థలను చూసి రంజిత్ చలించిపోయాడు. తన డ్రైవర్ వృత్తిని మానేశాడు. భార్య బంగారాన్ని తాకట్టు పెట్టాడు. వచ్చిన రూ. 70 వేలతో తండ్రి సహకారంతో బ్రిడ్జి నిర్మాణానికి పునాది రాయి వేశాడు.
కాంక్రీట్ బ్రిడ్జికి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని తెలుసుకున్న రంజిత్.. కట్టెలతో వంతెనను ఏర్పాటు చేశాడు. పెద్ద మొత్తంలో కర్రలను కొనుగోలు చేశాడు. ఓ 4 కిలోమీటర్ల మేర చెట్ల పొదలను తొలగించి గ్రామానికి రోడ్డు వేశాడు. ఇక నదిపై కర్రలతో వంతెనను అందుబాటులోకి తీసుకొచ్చాడు. కర్రల బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వైద్యం అందుతోందని రోగులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా రంజిత్ నాయక్ మాట్లాడుతూ.. అధికారులు స్పందించకపోవడంతో నదిపై కర్రల వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నాను. అందుకు తన తండ్రి సహకారం తీసుకున్నాను. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం తన డ్రైవింగ్ వృత్తిని వదులుకున్నాను. దాదాపు ఆరేడు నెలలు కష్టపడి ఈ వంతెనను నిర్మించాం. నదిని దాటేందుకు రోగులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడేవారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాల పాలయ్యారు. కొన్ని సందర్భాల్లో తమ బైక్‌లు కూడా కొట్టుకుపోయాయి. ఇవన్నీ గమనించిన నేను చలించిపోయి.. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాను అని రంజిత్ పేర్కొన్నాడు.