పేకాట శిబిరంపై దాడి వెనుక మేయర్..? రాత్రి 4 గంటలు కరెంట్ కట్!
Peerzadiguda | పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో నిర్వహించిన పేకాట శిబిరంపై దాడి వెనుక మేయర్ ఉన్నారా? తనపై అవిశ్వాస తీర్మానానికి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిని ఇరుకున పెట్టించేందుకు మేయర్ కుట్ర చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తీరుపై కొంతకాలం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి వారు […]

Peerzadiguda | పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో నిర్వహించిన పేకాట శిబిరంపై దాడి వెనుక మేయర్ ఉన్నారా? తనపై అవిశ్వాస తీర్మానానికి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిని ఇరుకున పెట్టించేందుకు మేయర్ కుట్ర చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తీరుపై కొంతకాలం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి వారు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై తన సన్నిహితులతో మేయర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో కుర్రా శివకుమార్ గౌడ్ ఆదివారం రాత్రి తన కార్యాలయంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జక్కా వెంకట్ రెడ్డికి తెలిసింది. ఇదే అదునుగా భావించిన మేయర్.. మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులకు, మీడియాకు ముందే సమచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కుర్రా శివకుమార్ గౌడ్ పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని, పోలీసులకు దొరికిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు ఓ టీమ్‌ను కూడా మేయర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే పేకాట వ్యవహారంలో వారిని ఇరికించి, అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే మేయర్ కుట్ర చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నిన్న రాత్రి ఏం జరిగిందంటే..?
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ కార్యాలయంలో నిన్న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కుర్రా శివకుమార్ గౌడ్‌తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పలువురు బిల్డర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేకాట శిబిరంలో డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మహేశ్, కార్పొరేటర్ల భర్తలు యాసారం మహేశ్, శ్రీధర్ రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి, బుడిగె కృష్ణగౌడ్, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఉన్నట్లు తేలింది.
అయితే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కుర్రా శివకుమార్ గౌడ్ కార్యాలయం లోపలికి వెళ్లిన పోలీసులు.. రాత్రి 11:30 గంటల వరకు బయటకు రాలేదు. ఆ నాలుగు గంటల పాటు ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిపివేయడం చాలా అనుమానీలకు తావిస్తోంది.
కరెంటు నిలివేసిన సమయంలోనే పేకాట ఆడిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బిల్డర్లను తప్పించేందుకు ఓ మంత్రి స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆదేశాల మేరకు నాలుగు గంటల పాటు విద్యుత్‌ను నిలిపివేసి ప్రజా ప్రతినిధులను తప్పించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేక్రమంలో పొలీసులు కెమెరాలు గుంజుకుని మీడియాపై దాడులు చేసినట్టు సమాచారం.