128 ఏళ్ల క్రితం మ‌రణించిన వ్య‌క్తికి ఇప్పుడు ఖ‌న‌నం.. ఎందుకంటే..

  • By: Somu    latest    Oct 02, 2023 10:03 AM IST
128 ఏళ్ల క్రితం మ‌రణించిన వ్య‌క్తికి ఇప్పుడు ఖ‌న‌నం.. ఎందుకంటే..

విధాత‌: సుమారు శ‌తాబ్ద కాలంగా అంత్య‌క్రియ‌ల‌కు నోచుకోని ఓ మ‌మ్మీకి ఇప్పుడు ద‌హ‌న‌ సంస్కారాలు చేయ‌నున్నారు. 128 సంవ‌త్స‌రాల క్రితం ఒక దొంగ పెన్సెల్వేనియా (America) జైలులో శిక్ష పొందున్న స‌మ‌యంలో కిడ్నీ విఫ‌ల‌మ‌యై ప్రాణాలు కోల్పోయాడు. అయితే అత‌డి కుటుంబ‌స‌భ్యులు, స‌హ‌చ‌రుల స‌మాచారం దొర‌క‌క‌పోవ‌డంతో మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేయ‌డానికి చ‌ట్ట‌ప్ర‌కారం వీలు లేక‌పోయింది.


అయితే రీడింగ్ న‌గ‌రంలో ఉన్న‌ ఆమ‌న్స్ శ్మ‌శాన కేంద్రం నిర్వాహ‌కులు ఆ మృత‌దేహం త‌మ‌కు కావాల‌ని, మృత‌దేహాల‌ను ఎక్కువ కాలం పాడ‌వ‌కుండా ఉంచే ప‌రిశోధ‌న (ఎంబామింగ్‌) లో ఉప‌యోగిస్తామ‌ని కోర్టుకు నివేదించారు. దీనికి కోర్టు స‌మ్మ‌తించ‌డం, ఆ మృత‌దేహంపై ఎంబామింగ్ విధానం విజ‌య‌వంత‌మ‌వ‌డంతో ఆ మృత‌దేహం ప‌రిర‌క్ష‌ణ సాధ్య‌మైంది.


సుమారు 1896 నుంచి అది ఇక్క‌డి సంద‌ర్శ‌కుల‌ను అల‌రిస్తూనే ఉంది. ఆ దొంగ ఊరు పేరు తెలియ‌క‌ పోవ‌డంతో రీడింగ్ కేంద్రం నిర్వాహ‌కులు అత‌డికి స్టోన్‌మ్యాన్ విల్లీ అనే పేరు పెట్టి పిలుచుకునే వారు. ఇన్ని ద‌శాబ్దాలుగా స్టోన్‌మ్యాన్ విల్లీ మృత‌దేహం అనేక మంది పర్యాట‌కుల‌కు హాట్‌స్పాట్‌గా నిలిచింది.



మ‌రోవైపు అత‌డి కుటుంబ‌సభ్యులు, ఊరి పేరు, మొత్తంగా అత‌డి చ‌రిత్ర కోసం ఈ శ్మ‌శాన కేంద్రం అలుపెర‌గ‌ని ప‌రిశోధ‌న చేస్తూ వ‌చ్చింది. ఇప్ప‌టికి అత‌డి వివ‌రాలు తెలుసుకుంది. దీంతో స్టోన్‌విల్లీ ఖ‌న‌నానికి ఈనెల 7వ తీదీన భారీ ఏర్పాట్లు చేశారు. అత‌డి శ‌వాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్య‌క్రియ‌లు పూర్తి చేయ‌నున్నారు.


ఆ సంద‌ర్భంగానే అత‌డి పూర్తి పేరు వివ‌రాల‌ను బ‌హిరంగ ప‌రుస్తామ‌ని శ్మ‌శాన కేంద్రం నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. స్టోన్‌విల్లీని ఊరూ పేరూ లేని వ్య‌క్తిగా పంపించేయ‌కూడ‌ద‌నుకున్నాం. పైగా అత‌డి దేహం ఎంబామింగ్ ప్రక్రియ‌లో మా ప‌రిశోధ‌న‌కు సాయ‌ ప‌డింది. అత‌డికి మేం చెల్లించుకునే ఫీజు అత‌డి వివ‌రాల‌ను బ‌హిరంగ‌ ప‌ర‌చ‌డ‌మే అని సంబంధిత వ్య‌క్తులు పేర్కొన్నారు.