Katamayya Raksha Safety Kits : ‘కాటమయ్య రక్ష’ ఎక్కడ? .. గీత కార్మికుల ఆర్తనాదం !
తెలంగాణలో కల్లు గీత కార్మికుల ప్రాణాలకు భద్రత కరువవుతోంది. ‘కాటమయ్య రక్ష’ సేఫ్టీ కిట్లు ఉన్నా ప్రమాదాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
విధాత, హైదరాబాద్ : దేశం చంద్రయాన్..సూర్యయాన్ అంతరిక్ష ప్రయోగాల దిశగా దూసుకుపోతుంది. హ్యూమనాటిక్ ఏఐ రోబోల వినియోగం క్రమంగా అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం కల్లుగీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గీత కార్మికుల ప్రాణాలకు మాత్రం రక్షణ దక్కడం లేదు. కల్లు గీత కోసం తాటి, ఈత చెట్ల ఎక్కి జారిపడిపోతూ గౌడన్నలు మరణించడం..అంగ వైకల్యాల బారిన పడటం కొనసాగుతున్న తీరు ఆందోళన కల్గిస్తుంది. ఏటా సగటు 550 మంది గీత కార్మికులు చెట్లపై నుంచి జారిపడిపోతున్నట్లుగా గీత కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. కొందరు తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యానికి గురవుతుండగా మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సుద్దాల గ్రామంలో యమగాని బక్కయ్య(48), దిలావర్పూర్ గ్రామంలో సీసా పాండరీ గౌడ్(53)లు చెట్టుపై నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలు కాపాడలేకపోతున్న సెఫ్టీ కిట్ లు
గీత కార్మికుల ను ప్రమాదాల బారి నుంచి రక్షించే క్రమంలో తెలంగాణలో గత ప్రభుత్వంలో తెచ్చిన సేఫ్టీ పరికరాలు పెద్దగా ప్రయోజనం కల్గించలేదు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాధునిక పరికరాలతో ‘కాటమయ్య రక్ష’ సెఫ్టీ కిట్ పథకం తెచ్చినప్పటికి ఇది కూడా గీత కార్మికులు ప్రాణాలను కాపాడలేకపోతుంది. గీత కార్మికుల ప్రమాద నివారణ పథకాలు ఆచరణలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతుండటం..కార్మి కుటుంబాలకు బీమా, వైద్య వసతి, ఎక్స్ గ్రేషియా పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో గీత వృత్తినే నమ్ముకొని జీవించే గౌడ కుటుంబాలు దుర్భర స్థితిని గడుపుతున్నాయి.
సెఫ్టీ కిట్ లతో సెఫ్టీ ఎంత ?
తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల భద్రత కోసం 14 జులై 2024లో ‘కాటమయ్య రక్ష’పేరుతో ఆధునిక రక్షణ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. తాటి, ఈత చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి, ప్రాణ రక్షణకు ఉపయోగపడే ఆరు పరికరాలతో కూడిన ఈ భద్రతా కిట్లను (Safety Kits) ప్రభుత్వం గీత కార్మికులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా లష్కర్‌గూడలో ట్రయల్ రన్ నిర్వహించగా.. సీఎం రేవంత్ రెడ్డి హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో కిట్ ధర, ట్రైనింగ్ కలిపి రూ. 13 వేలు ఖర్చు అవుతుండగా.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది.రాష్ట్రంలో 1లక్షా 80 వేల మంది గీత కార్మికులు ఉండగా ఇప్పటి వరకూ తొలి దశలో 100 నియోజకవర్గాల్లో గీత కార్మికులకు 10 వేల కిట్లను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. టాడీ టాపర్స్ కోపరేటివ్ కార్పొరేషన్ కు గత ఏడాది అక్టోబర్ లో రూ. 34కోట్లను ప్రభుత్వం అప్పట్లో రిలీజ్ చేసింది. రెండో దశలో 10 వేల కిట్ల పంపిణీకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. బీసీ సంక్షేమ శాఖలోని టాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు కిట్ల వాడకంపై ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్ అందజేస్తున్నారు. రెండో దశలో 10 వేల కిట్లకుగానూ లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు.. అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ ను పూర్తి చేసి వాటిని పంపిణీ చేశారు. అదే ఆర్థిక సంవత్సరంలో 40వేల కిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కిట్ లకు నెలకొన్న డిమాండ్ తగ్గట్లుగా పంపిణీ సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిట్ లు వాడుతున్న గీత కార్మికులు జారి పడిన సందర్బాల్లో వారు ఎంతమేరకు వాటితో సేఫ్ అయ్యారన్న అధ్యయన నివేదికలు అందుబాటులో లేకపోవడం విచారకరం.
ఎక్స్ గ్రేషియా మంజూరులోనూ జాప్యం
తెలంగాణలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి మరణించిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం ‘గీత బీమా’ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా (పరిహారం) అందజేస్తోంది. ప్రమాదవశాత్తు చెట్ల పైనుంచి కిందపడి మరణించిన, దివ్యాంగులైన కల్లు గీత కార్మిక కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.65 కోట్ల బకాయిలు చెల్లించగా. రూ.13 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని గీత సంఘాలు కోరుతున్నాయి. కల్లు గీత వృత్తిలో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని, గాయాలైన వారికి రూ.2 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వంతో పాటు గుర్తింపు కార్డులు, ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత వికలాంగులకు గురైన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య, ఇంటి వసతిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గౌడన్నల వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలకు పెంచాలని, గీత వృత్తి సాగిస్తున్న కార్మికులకు మోటార్ సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు.రాష్ట్రంలో అన్ని టీఎఫ్‌టీ సహకార సంఘాల్లో కల్లు గీత కార్మికులందరికీ సంపూర్ణ సేఫ్టీ కిట్స్ అందించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Ban On Junk Food Ads : జంక్ ఫుడ్ పై కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన
Realme p4 : బిగ్ బ్యాటరీ.. రియల్ మి పీ4 మొబైల్ ఫోన్ వచ్చేసింది!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram