Karimnagar | కరీంనగర్ ప్రజలకు డంపింగ్ దడ

-
కాలుతున్న చెత్తతో కమ్ముకుంటున్న పొగ
-
16 కోట్లకు పైగా వెచ్చించినా చెత్త పాలే…
-
రెండు లక్షల టన్నులకు పైగా పేరుకుపోయిన చెత్త
-
బయో మైనింగ్ చేయలేక చేతులెత్తేసిన సంస్థ
-
నగర ప్రజల పరిస్థితి ఆందోళనకరమన్న జాతీయ హరిత ట్రిబ్యునల్
విధాత బ్యూరో, కరీంనగర్: ‘ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధునాతన పద్ధతుల్లో యంత్రాలు అమర్చి బయో మైనింగ్ ద్వారా చెత్త తొలగించే పనులు ప్రారంభించాం’ రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు కరీంనగర్ ను ఆదర్శంగా తీసుకొని డంపు యార్డుల ప్రక్షాళన చేపట్టాలి.. రెండేళ్ల క్రితం బయో మైనింగ్ యంత్రాలు ప్రారంభిస్తూ నాటి మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలివి.
‘కరీంనగర్ ను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దేందుకు బయోమైనింగ్ తొలిమెట్టు’ అంటూ
మేయర్ సునీల్ రావు ఆశావహ దృక్పథం.
వీరిద్దరి ఆశలు, ఆశయాలు ఏమైనా, కరీంనగర్ పట్టణ ప్రజలకు కాలుష్యంతో సహజీవనం చేయక తప్పడం లేదు.
పట్టణంలో జనావాసాలకు దగ్గరగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ తరచూ రావణాకాష్టలా రగులుతుండడంతో, దానిని భరించలేక, ప్రత్యామ్నాయ మార్గం లేక స్థానికులు నిత్యాగ్నిహోత్రం నుండి విముక్తి ఎప్పుడోనని ఎదురుచూపులు చూస్తున్నారు.
‘డంపింగ్ యార్డులో గత మూడు రోజులుగా ఎగసిపడుతున్న మంటలతో, విస్తరిస్తున్న పొగ, దుర్గంధంతో ‘.. కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రజల ఆగ్రహంతో మంటలను ఆర్పేందుకు హడావుడి చేయడం, ఆ తర్వాత మిన్న కుండిపోవడం నగర పాలక సంస్థ కు నిత్య కృత్యంగా మారింది.
కరీంనగర్ పట్టణ ప్రజలకు మానేరు తీరంలోని డంపింగ్ యార్డ్ సమస్యగా తయారైంది. తరచూ ఈ యార్డ్ లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా వ్యాప్తి చెందుతున్న పొగ, ఘాటైన వాసనలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ సమస్య నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ 16.50 కోట్లు వెచ్చించినా, ఆ నిధులన్నీ ‘చెత్త’ పాలే అయ్యాయి.
44 ఏళ్లకాలంగా డంపింగ్ యార్డులో పేరుకుపోయిన రెండు లక్షల టన్నుల చెత్తను తొలగించడం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి సవాల్ గా మారింది. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనలేని కార్పొరేషన్ పాలకవర్గ తీరుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకోంటోంది.
కరీంనగర్ పట్టణంలోని 60 డివిజన్లలో నాలుగు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుండి ప్రతిరోజు 150 నుండి 200 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది.
జనావాసాలకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ వెదజల్లుతున్న దుర్గంధం భరించడం స్థానికులకు నిత్య కృత్యమైంది. ఇక డంపింగ్ యార్డులో మంటలు చెలరేగినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. తద్వారా అనుకుంటున్న పొగ నగరాన్ని కమ్మేస్తుండగా, బైపాస్ రహదారి మీదుగా వెళ్లే వాహనాలకు తీవ్ర ప్రతిబంధకంగా మారింది.
ప్రజలకు తీవ్ర ప్రమాదకారి…
ఈ డంపింగ్ యార్డ్ నగర ప్రజలకు తీవ్ర ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చేసిన హెచ్చరికలు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
డంపింగ్ యార్డులో పేరుకుపోయిన రెండు లక్షల టన్నుల చెత్తలో, 44.65 శాతం సేంద్రియ వ్యర్థాలు, 53.6 శాతం పొడి చెత్త, 2.29 శాతం జడ వ్యర్ధాలు ఉన్నట్టు గతంలోనే ఒక సంస్థ లెక్కలు తేల్చింది. దీంతో పేరుకు పోతున్న చెత్తను తగ్గించడం, పునర్వినియోగం లక్ష్యంతో బయోమైనింగ్ వైపు మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేసింది.
అనుకున్నదే తడవుగా…
డంపింగ్ యార్డులోని చెత్తను తగ్గించడం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై గతంలోనే నగరపాలక సంస్థ కమిషనర్, సిబ్బంది గురుగ్రాం వెళ్లి ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేశారు. చెత్తను ప్రాసెస్ చేసి ప్రజలను కాలుష్య కోరల నుండి కాపాడేందుకు స్మార్ట్ సిటీ నిధుల కింద 16.50 కోట్లు కేటాయించి, పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు.
చెన్నైకి చెందిన హర్షిత అనే కంపెనీ టెండర్ దక్కించుకొంది. ఒప్పందం చేసుకున్న ఏడాది కాలంలో డంపింగ్ యార్డ్ శుభ్రం చేసి ఇవ్వాల్సిన బాధ్యతను ఆ సంస్థ తీసుకుంది. డంపింగ్ యార్డ్ లోని చెత్తను తొలగిస్తే, లభ్యమయ్యే ప్రదేశంలో పర్యావరణహితం కోసం గ్రీన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ తలపోసింది.
అయితే ఆ పనులేవి కార్యరూపం దాల్చలేదు. బయో మైనింగ్ టెండర్ దక్కించుకున్న సంస్థ ఆరు నెలల పాటు మూడు షిఫ్టులలో కార్మికులతో పని చేయించినా, గుట్టల మాదిరిగా పేరుకుపోయిన చెత్తను తొలగించలేక ‘ఇక తమ వల్ల కాదంటూ, చేతులెత్తేసింది’.
డంపింగ్ యార్డ్ ను తరలించాలి..
గురువారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కాలిపోయి, దట్టమైన పొగ వస్తున్న డంపింగ్ యార్డ్ ను పార్టీ ప్రతినిధులు సందర్శించారు. ప్రతి సంవత్సరం వేసవిలో డంపింగ్ యార్డ్ తగలబడి పోతుందని,దీని మూలంగా దట్టమైన పొగ వ్యాపించి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ అధికారులు, నగరమేయర్ శాశ్వత పరిష్కారం చూపించకపోవడం సిగ్గుచేటని సిపిఎం నగర కార్యదర్శి గుడి కందుల సత్యం ఆరోపించారు. కేవలం కాలిపోయి, పొగ వస్తున్నప్పుడు నామమాత్రంగా పర్యటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని, శాశ్వతంగా డంపింగ్ యార్డ్ ను తరలించడంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి వేసవిలో డంప్ యార్డ్ నుండి వస్తున్న పొగ కారణంగా ఆటోనగర్, అలుగునూర్,హౌసింగ్ బోర్డు, కోతి రాంపూర్, కట్టరాంపూర్ భగత్ నగర్,పాత బజార్ కాలనీవాసులు ఊపిరాడక అనారోగ్యానికి గురవుతున్నారని, బాటసారులకు దారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు.
పక్కనే కోట్లాది రూపాయలు వెచ్చించి తడి చెత్త, పొడి చెత్తతో కంపోస్ట్ తయారు చేస్తామని షెడ్లు నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని, కంపోస్ట్ తయారు చేస్తామని చెప్పి కేటాయించిన కోట్లాది రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఇప్పటికే కోవిడ్ మూలంగా ప్రజలు శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని,డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ వారికి మరింత సమస్యాత్మకంగా మారిందన్నారు.