KTR: కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు బొక్కబోర్లా పడ్డారు: కేటీఆర్

KTR: కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు బొక్కబోర్లా పడ్డారు: కేటీఆర్

శతాబ్ధపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ అభయ హస్తం
ఫిరాయింపు ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి
జూన్ మాసంలో బీఆర్ఎస్ మెంబర్ షిప్
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు బొక్కబోర్లా పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాతా 10ఏండ్లు తెలంగాణ రాష్ట్రానికి బలమైన పునాది వేశామని..ప్రజలు ఎన్నికల్లో దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారన్నారు. ఎన్ని రోజులు చూడాలి కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయ హస్తం అని విమర్శించారు. నాడు నీళ్లు, నిధులు , నియామకాలు కోసం ఉద్యమం చేస్తే..నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిందలు, దందాలు, చందాలు అన్నట్లుగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 420ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యాడని కేటీఆర్ విమర్శించారు.

రుణమాఫీపై కప్పదాట్లు

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డివ అనేక మార్లు మాట మార్చాడని కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీకి రూ. 49,500 కోట్లు కావాలని అధికారంలోకి వచ్చిన మూడు రోజులకు భట్టి విక్రమార్క చెప్పిండని.. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండని కేటీఆర్ గుర్తు చేశారు. కేబినెట్ సమావేశంలో రూ. 31 వేల కోట్ల రుణమాఫీ అన్నారని.. అసెంబ్లీలో రూ. 26 వేల కోట్ల రుణమాఫీ అన్నారని. రూ. 11,000 కోట్లు ఇచ్చామని రుణమాఫీ చేయండి అని బ్యాంకర్లకు భట్టి విక్రమార్క చెప్పాడని కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 49,500 కోట్ల రుణమాఫీ చివరకు రూ.11వేల కోట్లకు వచ్చిందని..అది కూడా పూర్తిగా కాలేదన్నారు. పైగా సిగ్గులేకుండా చారాణ కోడికి భారాణ మసాలా అన్నట్లు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒకసారి రాము , ఇంకోసారి రెమో అవుతాడని..సినిమాలో రెమోకు జుట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదు అంతే.. మిగదంతా సేమ్ టు సేమ్ అని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి.. నన్ను కోసుకొని తినండి అని మాట్లాడుతాడాని..ఓ వైపు అప్పులంటూనే అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు చేస్తాడని విమర్శించాడు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి

పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని..ఆవేశంతో చెప్పడం లేదని..బాధతో చెప్తున్నానని కేటీఆర్ అన్నారు. ఆ 10మంది సన్నాసులకు కర్రు కాల్చి వాతపెట్టాలని..మనతోనే ఉండి మనకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. గద్వాల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ఖాయమని..200 జెట్ స్పీడ్ తో కారు గెలవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రాబోతున్న స్థానిక ఎన్నికలకు కేడర్ సిద్ధం కావాలన్నారు. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
జూన్ మాసంలో బీఆర్ఎస్ మెంబర్ షిప్ చేపడుతామని..గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు వేస్తామని ప్రకటించారు.