బ్యాలెన్స్ కోల్పోయిన సీఎం స్టాలిన్.. పట్టుకున్న ప్రధాని మోదీ
తమిళనాడు రాజధాని చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు.
అయితే స్టేడియం వేదిక వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో సీఎం స్టాలిన్ బ్యాలెన్స్ కోల్పోయారు. పక్కనే ఉన్న మోదీ.. స్టాలిన్‌ను గమనించి, ఆయన ఎడమ చేతిని పట్టుకుని సహాయం చేశారు. స్టాలిన్ వెనుకాలే ఉన్న ఉదయనిధి కాస్త కంగారు పడ్డారు. ఆ తర్వాత మోదీ, స్టాలిన్ క్షేమంగా వేదికపైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఖేలో ఇండియా ఈవెంట్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు. 2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలన్నారు. క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపును అందించడానికి, భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌కు కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
యూపీఏ హయాంలో క్రీడలకు సంబంధించిన అవినీతి, అక్రమాలను మోదీ గుర్తు చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం క్రీడల్లో ఆటలకు స్వస్తి పలికిందని మోదీ పేర్కొన్నారు. కాగా, తమిళనాడును దేశ క్రీడా రాజధానిగా మార్చడమే డీఎంకే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు.