PM Modi | కన్యాకుమారి నుంచి మోదీ పోటీ? కాదంటే కోయంబత్తూర్‌!

PM Modi కాదంటే కోయంబత్తూర్‌ నుంచి! రామనాథపురంలో గెలవడం కష్టమే తమిళనాడులో జోరు పెంచిన బీజేపీ చెన్నై: ఈసారి తమిళనాడులోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. కన్యాకుమారి లేదా కోయంబత్తూర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తున్నది. ముందుగా రామనాథపురం నుంచి పోటీ చేయాలని భావించినా.. అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కన్యాకుమారి లేదా కోయంబత్తూర్‌ నుంచి ఆయన పోటీచేస్తే మంచిదని చెబుతున్నారు. గతంలో […]

  • By: Somu    latest    Jul 31, 2023 12:29 PM IST
PM Modi | కన్యాకుమారి నుంచి మోదీ పోటీ? కాదంటే కోయంబత్తూర్‌!

PM Modi

  • కాదంటే కోయంబత్తూర్‌ నుంచి!
  • రామనాథపురంలో గెలవడం కష్టమే
  • తమిళనాడులో జోరు పెంచిన బీజేపీ

చెన్నై: ఈసారి తమిళనాడులోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. కన్యాకుమారి లేదా కోయంబత్తూర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తున్నది. ముందుగా రామనాథపురం నుంచి పోటీ చేయాలని భావించినా.. అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవని పార్టీ నాయకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో కన్యాకుమారి లేదా కోయంబత్తూర్‌ నుంచి ఆయన పోటీచేస్తే మంచిదని చెబుతున్నారు. గతంలో కన్యాకుమారి నుంచి బీజేపీ నాయకుడు పోన్‌ రాధాకృష్ణన్‌, కోయంబత్తూరు నుంచి సీపీ రాధాకృష్ణన్‌ గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాలు బీజేపీ బలమైన ప్రాంతాలుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రెండింటిలో ఒక దాని నుంచి పోటీ చేసేందుకు మోదీ సానుకూలం వ్యక్తం చేస్తారన్న అభిప్రాయంతో ఉన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు, సీనియర్‌ నేతల సమావేశంలో ప్రధాని మోదీ ఈసారి రామనాథపురం నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఇక్కడ ముస్లిం జనాభా గణనీయంగా ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌)కు చెందిన నవాస్‌కని ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అయితే.. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయించిన బీజేపీ నేతలు.. ఇక్కడ బీజేపీకి తగినంత బలం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. బీజేపీ బూత్‌ కమిటీలు కూడా తగినంత బలంగా లేవని తేల్చారు. ఇక్కడ తన మిత్రపక్షం అన్నాడీఎంకే మద్దతుపైనే బీజేపీ ఆధారపడాల్సి వస్తుంది. మోదీ పోటీ చేసే స్థానంలో ఇంత రిస్క్‌ తీసుకోవడం మంచిది కాదన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మోదీని కన్యాకుమారి లేదా కోయంబత్తూర్‌ నుంచి పోటీలో దింపాలని యోచిస్తున్నారు. ఈ ఆలోచనకు ఆరెస్సెస్‌ కూడా సుముఖంగానే ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా తమిళనాడులో తన కార్యకలాపాలను బీజేపీ గణనీయంగా పెంచడం గమనార్హం. ప్రధాని కూడా తమిళ భాష, తమిళ సంప్రదాయం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇటీవల కొత్త పార్లమెంటు ప్రారంభం సందర్భంగా తమిళనాడులోని పురాతన సంస్కృతి అయిన సెంగోల్‌ (రాజదండం)ను పార్లమెంటులో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే.

గతంలో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వరుసగా చిక్‌మంగళూరు, బళ్లారి, వయనాడ్‌ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో బీజేపీ తమిళనాడుపై దృష్టిసారించింది. దీనితోపాటు దక్షిణాదిలోని తెలంగాణపైనా ఆశలు పెట్టుకున్నది. తమిళనాడు, తెలంగాణతో పోల్చితే బీజేపీకి కేరళ అంత సులువైంది కాదు. దాంతో ఇక్కడ పోటీకి ఆలోచనే చేయలేదని చెబుతున్నారు. తమిళనాడులో మోదీ పోటీ చేస్తే దాని ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాలపై ఉంటుందనేది ఆ పార్టీ నేతల ఆలోచన.