PM Modi | భయపడే వాడు.. ఈ మోదీ కాదు

PM Modi కాంగ్రెస్‌ అవినీతికి గ్యారెంటీ అయితే.. దానిపై చర్యలు తీసుకోవడం గ్యారెంటీ రాయ్‌పూర్‌: అవినీతి ప్రభుత్వాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను దేనికీ భయపడేది లేదని చెప్పారు. ‘జో డర్‌ జాయే. వో మోదీ నహీ (భయపడేవాడు మోదీ కాదు)’ అని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు […]

  • By: Somu    latest    Jul 07, 2023 12:50 PM IST
PM Modi | భయపడే వాడు.. ఈ మోదీ కాదు

PM Modi

  • కాంగ్రెస్‌ అవినీతికి గ్యారెంటీ అయితే..
  • దానిపై చర్యలు తీసుకోవడం గ్యారెంటీ

రాయ్‌పూర్‌: అవినీతి ప్రభుత్వాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను దేనికీ భయపడేది లేదని చెప్పారు. ‘జో డర్‌ జాయే. వో మోదీ నహీ (భయపడేవాడు మోదీ కాదు)’ అని అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకొనేందుకైనా తాను వెనుకాడబోనని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం వెచ్చించిన నిధుల కంటే రెట్టింపు నిధులను తాము ఛత్తీస్‌గఢ్‌ కోసం ఇచ్చామని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పేదలకు శతృవు అని చెప్పారు. కాంగ్రెస్‌కు అవినీతే అత్యంత పెద్ద సిద్ధాంతమని విమర్శించారు. అవినీతికి కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీ అయితే.. ఆ అవినీతిపై చర్యలు తీసుకోవడమూ గ్యారెంటీ అని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ను కాంగ్రెస్‌ తన ఏటీఎంలా మార్చుకున్నదని ప్రధాని ఆరోపించారు. ప్రతి శాఖ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ హామీ ఇచ్చినా.. వాస్తవానికి ఆ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ కుంభకోణం నిధులు కాంగ్రెస్‌ ఖాతాలోకి మళ్లాయని చెప్పారు. 2019లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మోదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది చివరిలో ఛత్తీస్‌గఢ్‌కు ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే 25 ఏళ్లు ఛత్తీస్‌గఢ్‌కు అత్యంత కీలకమన్న మోదీ.. కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తు హస్తాన్ని పరోక్షంగా గుర్తుకు తెస్తూ.. ఈ క్రమంలో పెద్ద ‘పంజా’ అడ్డుగోడలా నిలిచి ఉన్నదని అన్నారు. ప్రజల హక్కులను గుంజుకునేందుకు కాంగ్రెస్‌ కంకణం కట్టుకున్నదని ఆరోపించారు.