Manukota | మానుకోటలో ‘మామిడితోట’ రాజకీయం
Manukota ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏకైక లక్ష్యం తక్కెళ్లపల్లి వెనుక అదృశ్యహస్తమెవరిది? గులాబీల మధ్య హీటెక్కిన వర్గపోరు తోటల్లో బీఆరెస్ అసమ్మతి భేటీలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట గులాబీ రాజకీయం మామిడి తోటల చుట్టూ తిరుగుతున్నది. వరుసగా బీఆరెస్ అసమ్మతి నాయకులు మామిడి తోటల్లో సమావేశమవుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. మానుకోట బీఆరెస్.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది. శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న […]

Manukota
- ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏకైక లక్ష్యం
- తక్కెళ్లపల్లి వెనుక అదృశ్యహస్తమెవరిది?
- గులాబీల మధ్య హీటెక్కిన వర్గపోరు
- తోటల్లో బీఆరెస్ అసమ్మతి భేటీలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట గులాబీ రాజకీయం మామిడి తోటల చుట్టూ తిరుగుతున్నది. వరుసగా బీఆరెస్ అసమ్మతి నాయకులు మామిడి తోటల్లో సమావేశమవుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. మానుకోట బీఆరెస్.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది.
శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అసమ్మతి సమావేశాలకు దీటుగా, ఆయన అనుకూల వర్గం సైతం సమావేశాలు నిర్వహిస్తూ అసమ్మతి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఢీ అంటే ఢీ అంటూ పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ, దూషణలకు దిగుతున్నారు. అమీతుమీకి సిద్ధమవుతున్నారు. సొంత పార్టీలోనే నెలకొన్న గ్రూపు విభేదాలతో మానుకోట రాజకీయం వేడి పుట్టిస్తున్నది.
తక్కెళ్లపల్లి వెనుక అదృశ్య హస్తం!
మహబూబాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అసలు అవకాశం లేని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఈ అసమ్మతికి నాయకుడిగా తెరపైకి రావడం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఏదో తెర వెనుక రాజకీయం దాగి ఉందనే చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతున్నది. శంకర్ నాయక్‌ను తప్పించేందుకు అదృశ్య శక్తి బలంగా పనిచేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పైకి శంకర్ నాయక్‌కు మద్దతు తెలుపుతూనే లోపల వచ్చే సారి ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేయాలనేదే ప్లాన్‌గా చెబుతున్నారు.
ఒక దశలో అధిష్ఠానం ఆశీస్సులతోటే ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ నాయక్‌కు టికెట్ ఇవ్వకుండా, మరో పార్టీలోకి మారే అవకాశం కల్పించకుండా ఆయన ప్రతిష్ఠను దిగజార్చే చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు. దీనికి శంకర్ నాయక్‌పై ఉన్న భూకబ్జా, ఇతరత్రా ఆరోపణలు సొంత పార్టీ నాయకుల నోటి వెంట రావడం చర్చనీయాంశంగా మారింది.
శంకర్ నాయక్‌కు టికెట్ వద్దు
వారం క్రితం మహబూబాబాద్ మండలం ముడుపుగల్లులోని మామిడి తోటలో బీఆరెస్ కార్యకర్తలు సమావేశమై.. శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా గొంతు విప్పారు. శంకర్ నాయక్ వద్దు కొత్త అభ్యర్థి ముద్దు అంటూ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. జెర్రిపోతుల వెంకన్న నాయకత్వంలో స్థానిక బీఆరెస్ నాయకులు సమావేశమై శంకర్ నాయక్ వ్యతిరేకంగా ఏకంగా తీర్మానాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు అనుచరులమంటూ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేకు మింగుడు పడని పరిణామాలు
ఇటీవల సీఎం కేసీఆర్‌ను శంకర్ నాయక్ కలిసిన తర్వాత తనకే టికెట్ ఖాయమని భరోసాతో ఉన్నారు. ఈ సందర్భంలో తాజా పరిణామాలతో ఎమ్మెల్యేకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది. ఈ అసమ్మతిపై స్పందించిన శంకర్ నాయక్ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. సమావేశమైన తదుపరి అసమ్మతి వర్గంపై శంకర్ నాయక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. శంకర్ నాయక్ మద్దతుగా కేసముద్రం మండల నాయకులు రంగంలోకి దిగి విమర్శలు చేసిన నాయకులపై మండిపడ్డారు.
అసమ్మతినేతలకు ఎమ్మెల్యే హెచ్చరిక
అసమ్మతి నియోజకవర్గమంతా పాకకముందే ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. బీఆరెస్‌లో గ్రూపులకు తావు లేదని, ఇక్కడ ఉన్నది ఒక్కటే కేసీఆర్ గ్రూప్ అంటూ అసమ్మతి నాయకులకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.
కేసీఆర్ ఆదేశిస్తే ప్రాణమిచ్చేందుకు కూడా సిద్ధం అంటూ ప్రకటించి, అసమ్మతికి అడ్డుకట్ట వేయడమే కాకుండా ఆ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావుకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.
మళ్లీ మదనతుర్తి మామిడి తోటలో
నియోజకవర్గం సమావేశంతో సమస్య సద్దుమణుగుతుందని ఎమ్మెల్యే భావించినప్పటికీ, రెండు రోజులకే నెల్లికుదురు మండలం మదనతుర్తి లోని మామిడి తోటలో మరో అసమ్మతి సమావేశం జరగడం కలకలం సృష్టించింది. ఈ అసమ్మతి సమావేశంలో పాల్గొన్న నాయకులు మరోసారి ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి వ్యతిరేకంగా శంకర్ నాయక్ అనుకూల వర్గం మదనతుర్తిలో సమావేశమై అసమ్మతి నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆరెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, రెచ్చగొట్టే ధోరణితో నిర్వహిస్తున్న ఇలాంటి సమావేశాలు మానుకోవాలంటూ శంకర్ నాయక్ మద్దతుగా ఆయన వర్గం నాయకులు, ప్రజాప్రతినిధుల ఆందోళన చేపట్టారు. ఈ తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.