Kareemnagar: సమాజాన్ని అమితంగా ప్రభావితం చేయగల శక్తిమంతులు సాహితీవేత్తలు: మంత్రి గంగుల

ఎందరో కవులకు పుట్టినిల్లు కరీంనగర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జిల్లాకే గర్వకారణం తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కవులు, కళాకారులే కవులు ,కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించుకోవడం మన సంస్కృతి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విధాత బ్యూరో, కరీంనగర్: సమాజాన్ని అమితంగా ప్రభావితం చేయగల శక్తిమంతులు సాహితీవేత్తలేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద […]

Kareemnagar: సమాజాన్ని అమితంగా ప్రభావితం చేయగల శక్తిమంతులు సాహితీవేత్తలు: మంత్రి గంగుల
  • ఎందరో కవులకు పుట్టినిల్లు కరీంనగర్
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జిల్లాకే గర్వకారణం
  • తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కవులు, కళాకారులే
  • కవులు ,కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించుకోవడం మన సంస్కృతి
  • రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

విధాత బ్యూరో, కరీంనగర్: సమాజాన్ని అమితంగా ప్రభావితం చేయగల శక్తిమంతులు సాహితీవేత్తలేనని
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు వారాల ఆనంద్ కు జిల్లా యంత్రాంగం తరఫున ఏర్పాటుచేసిన పౌర సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వారాల ఆనంద్ కు రావడం జిల్లాకే గర్వకారణమని పేర్కొంటూ ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలిపారు. మూల రచయిత యొక్క కవితాత్మను, భావాలను పాఠకుల మనస్సుకు హత్తుకునేలా చేరవేసిన గొప్ప రచయిత, అనువాదకుడు వారాల ఆనంద్ అని వివరించారు. కవిత్వాన్ని చదవడం, అధ్యయనం చేయడాన్ని ఆనంద్ తన జీవితంలో ఒక అంతర్భాగం చేసుకున్నారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందడం ద్వారా కరీంనగర్ జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపినందుకు గర్వకారణంగా ఉందని ఆయనను అభినందించారు.

దేశ ప్రధానిగా పనిచేసి, దేశ ఆర్థిక మూలాలను మలుపు తిప్పిన ఆర్థికవేత్త పీవీ నరసింహారావు కరీంనగర్ గడ్డ మీద పుట్టారని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారని, ఆ వారసత్వాన్ని ఆనంద్ కొనసాగించడం గర్వంగా ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా కరీంనగర్ సాహిత్యానికి ఒక వేదిక ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని, దానిలో భాగంగా త్వరలోనే సాహిత్య భవనానికి భూమి పూజ చేసి కవులను సత్కరించుకుందామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వారాల ఆనంద్ ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ వారాల ఆనంద్ తన మనసుతో తాను మమేకమై అనువాద సాహిత్యంలో కృషి చేస్తున్నారని, ఆ పరంపరలోనే ‘ఆకుపచ్చ కవితలు’ అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం ద్వారా కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రానికి గౌరవం తీసుకు రావడం గర్వకారణంగా ఉందన్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ మాట్లాడుతూ సొంత ఊర్లో సత్కారం పొందడం గర్వంగా ఉందని అన్నారు. కరీంనగర్ గడ్డకు ఉన్న శక్తి సాహిత్యమని, పీవీ నరసింహారావు, సి నారాయణ రెడ్డి, బాపురెడ్డి, తోట వైకుంఠం, రాజన్ బాబు, ముద్దసాని రామ్ రెడ్డి వారు పుట్టిన గడ్డ కరీంనగర్ జిల్లా అని గుర్తు చేశారు.

కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జి వి శ్యాంప్రసాద్ లాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సాహితీగౌతమి కార్యనిర్వాహక అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ, ప్రముఖ తమిళ కవి వీర రాఘవన్ , కవులు, సాహితివేతలు తదితరులు పాల్గొన్నారు.