Praful Patel | కలిసుందాం మామా.. శరద్‌పవార్‌కు అజిత్‌పవార్‌ విజ్ఞప్తి

Praful Patel వైబీ చవాన్‌ సెంటర్‌కు వెళ్లి కలిసిన నేతలు తాజా పరిణామాలపై అజిత్‌ విచారం స్పందించని మరాఠా దిగ్గజ నేత చెప్పింది విన్నారు.. ఏమీ మాట్లాడలేదు మీడియాతో చీలికవర్గం నేత ప్రఫుల్‌ పటేల్‌ ముంబై : బెంగళూరులో ప్రతిపక్షాల భేటీకి ఒక్క రోజు ముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీలిక వర్గం నాయకుడు అజిత్‌పవార్‌.. ఎన్సీపీ చీఫ్‌, తన మామ శరద్‌పవార్‌ను కలిశారు. తన వర్గానికి చెందిన పలువురు నాయకులను వెంటబెట్టుకుని.. ఆదివారం వైబీ […]

Praful Patel | కలిసుందాం మామా.. శరద్‌పవార్‌కు అజిత్‌పవార్‌ విజ్ఞప్తి

Praful Patel

  • వైబీ చవాన్‌ సెంటర్‌కు వెళ్లి కలిసిన నేతలు
  • తాజా పరిణామాలపై అజిత్‌ విచారం
  • స్పందించని మరాఠా దిగ్గజ నేత
  • చెప్పింది విన్నారు.. ఏమీ మాట్లాడలేదు
  • మీడియాతో చీలికవర్గం నేత ప్రఫుల్‌ పటేల్‌

ముంబై : బెంగళూరులో ప్రతిపక్షాల భేటీకి ఒక్క రోజు ముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీలిక వర్గం నాయకుడు అజిత్‌పవార్‌.. ఎన్సీపీ చీఫ్‌, తన మామ శరద్‌పవార్‌ను కలిశారు. తన వర్గానికి చెందిన పలువురు నాయకులను వెంటబెట్టుకుని.. ఆదివారం వైబీ చవాన్‌ సెంటర్‌కు అజిత్‌పవార్‌ వెళ్లటం రాజకీయంగా సంచలనం రేపింది. శరద్‌పవార్‌పై తిరుగుబాటు అనంతరం అజిత్‌పవార్‌ ఆయనను కలవడం ఇదే మొదటిసారి.

‘మా పూజ్యనీయుడు, గౌరవనీయులు శరద్‌పవార్‌ సాహెబ్‌ను కలిసి, ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు మేమంతా వచ్చాం. ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని మేం శరద్‌పవార్‌ను కోరాం. ఆయన ఏమీ స్పందించలేదు’ అని అనంతరం అజిత్‌ వర్గం నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌ మీడియాకు చెప్పారు. సచివాయానికి దగ్గరలోనే వైబీ చవాన్‌ సెంటర్‌ ఉంటుంది. తాము ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆయనను కలిసేందుకు వచ్చామన్న ప్రఫుల్‌.. తాము చెప్పింది విన్నారు తప్పించి.. ఏమీ మాట్లాడలేదని తెలిపారు.


శరద్‌పవార్‌ను కలిసేందుకు వచ్చినవారిలో అజిత్‌పవార్‌, పటేల్‌తోపాటు.. ఎన్సీపీ మంత్రులు హస్‌ ముష్రిఫ్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, అదితి టట్ఖరే, దిలీప్‌ వాల్సే పాటిల్‌ ఉన్నారు. ఈ సమయంలో ఎన్సీపీ (శరద్‌ శిబిరం) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌, పార్టీ నాయకుడు జితేంద్ర అవహద్‌ కూడా వైబీ చవాన్‌ సెంటర్‌కు వచ్చారు. ఇటీవలి పరిణామాలపై అజిత్‌ శిబిరం విచారం వ్యక్తం చేసిందని పాటిల్‌ చెప్పారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మార్గం చెప్పాలని శరద్‌పవార్‌ కోరారని తెలిపారు.

అయినా వాళ్లు వారి వైఖరికే కట్టుబడి ఉన్నారని చెప్పారు. తమకు పార్టీలో 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని పాటిల్‌ తెలిపారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న శరద్‌పవార్‌ భార్యను పరామర్శించేందుకు శరద్‌ నివాసమైన సిల్వర్‌ ఓక్‌ను అజిత్‌ పవార్‌ సందర్శించిన విషయం తెలిసిందే. తన అత్త ప్రతిభతో అజిత్‌కు మంచి అనుబంధం ఉన్నది. 2019లో అజిత్‌పవార్‌. దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ప్రభుత్వంలో ఉన్న సమయంలో తిరిగి ఆయనను ఎన్సీపీలోకి ఆమే తీసుకొచ్చారని చెబుతారు.