ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ టాపింగ్.. ప్రణీత్‌రావును కస్టడీకి కోరుతున్న పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీకి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావును అరెస్టు చేసిన పోలీసులు విచారణలో అతడిని నుంచి పలు కీలక సమాచారం సేకరించారు.

  • By: Somu    latest    Mar 14, 2024 11:51 AM IST
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ టాపింగ్.. ప్రణీత్‌రావును కస్టడీకి కోరుతున్న పోలీసులు

విధాత: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీకి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావును అరెస్టు చేసిన పోలీసులు విచారణలో అతడిని నుంచి పలు కీలక సమాచారం సేకరించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ టాపింగ్ చేసినట్లుగా విచారణలో ప్రణీత్ రావు వెల్లడించినట్లుగా పోలీసు వర్గాల కథనం. ఫోన్ టాపింగ్ చేసి సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చానని, ప్రజా ప్రతినిధుల, అధికారుల, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను టాప్ చేశానని, నా పైన ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబి చీఫ్‌కి ఆ సమాచారం ఇచ్చానని ప్రణీత్ రావు వెల్లడించడంతో కేసు విచారణలో కీలక పురోగతి సాధించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.


కొంతమంది ప్రజాప్రతినిధుల, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా టాప్ చేసినట్లుగా, చాలామంది అధికారుల, ప్రజా ప్రతినిధుల వాట్సాప్ లపై నిఘా పెట్టినట్లుగా, అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేసినట్లుగా, సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేసినట్లుగా ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రణీత్ రావును మరొకసారి తిరిగి విచారించేందుకు అతడిని వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ తో పాటు ఎస్పీ, డిఎస్పీలను విచారించేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసు పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా ఉండటంతో పోలీసులు దర్యాప్తును వేగంగా ముందుకు దూకిస్తున్నారు.