భయంకరమైన మొసలికి.. భారీ కొండచిలువకు పోరాటం.. ఎవరు గెలిచారో తెలుసా?
అడవిలో జంతువుల మధ్య పోరాటాలు నువ్వా నేనా అనుకునేలా సాగుతాయి. ఆ పోరాటాలు కెమెరా కంటికి చిక్కి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి

విధాత: అడవిలో జంతువుల మధ్య పోరాటాలు నువ్వా నేనా అనుకునేలా సాగుతాయి. చాలా వరకు అవి మనకు కనపడకపోయినప్పటికీ కొన్ని సార్లు ఆ పోరాటాలు కెమెరా కంటికి చిక్కి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి జీవన్మరణ పోరాటం చేసిన ఓ మొసలి (Alligator) , కొండచిలువల (Burmese Python) వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
అమెరికా (America) లోని ఫ్లోరిడాలో ఉన్న ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ఈ వీడియోను షూట్ చేసినట్లు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అలీసోన్ జాస్లిన్ తెలిపారు. ఇందులో భారీ కొండచిలువ, భారీ మొసలి సిగపట్లు పట్టుకుంటూ ఒకదానిని ఒకటి తినాలని పోరాటం చేస్తున్నాయి. ‘ఇలాంటి అద్భుతం నా కళ్లతో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. బైక్ మీద పార్క్‌లో ఫొటోలు తీసుకుంటూ వెళుతుంటే ఈ దృశ్యం కనిపించింది. వెంటనే ఆగిపోయి అక్కడేం జరుగుతోందో మొత్తం చూసా’ అని జాస్లిన్ తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. సుమారు ఒక గంట పాటు ఆ రెండింటి మధ్య భీకరమైన యుద్ధమే జరిగిందని వివరించారు. ఒకదానిపై ఒకటి పైచేయి సాధించుకుంటూ విరామం లేకుండా దెబ్బలాడుకున్నాయన్నారు. ఆఖరికి మొసలి చేతిలో కొండచిలువ ఓడిపోయిందని వివరించారు. ‘కొద్ది సేపటి తర్వాత రెండూ నిశ్శబ్దంగా ఉండిపోయాయి. ఒక గంట నుంచి పెనుగులాట జరుగుతుండటంతో రెండింటికీ తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో మొసలి, కొండచిలువ రెండూ చనిపోయాయి అనుకున్నా. అంతలోనే మొసలి ఒక కన్ను తెరిచి… నేనే విజేత అన్నట్లు ఒక లుక్ ఇచ్చింది’ అని జాస్లిన్ ఆ ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆనక ఆ కొండచిలువను మొసలి హాంఫట్ చేసిందని తెలిపారు. కొండచిలువే మొసలిని తినడానికి వచ్చి ఉంటుందని.. కానీ ఓడిపోయి మొసలికే భోజనంగా మారిపోయిందని పార్క్ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
ఫ్లోరిడా ప్రాంతం.. అతి క్రూరమైన బర్మీస్ కొండచిలువలకు నిలయం. కొన్ని సార్లు ఇవి మనుషుల మీదా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఇక్కడ జన సమ్మర్థ ప్రాంతాల్లో కొండచిలువలు కనిపిస్తే వాటిని చంపడానికి చట్టాలు అనుమతిస్తాయి. కొండచిలువలు విపరీతంగా పెరిగిపోవడంతో పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కో పైథాన్ ఆరు అడుగుల నుంచి తొమ్మది అడుగుల వరకు ఉండి.. భారీ జంతువులను వేటాడతాయి.