Employment Generation | ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలె..

Employment Generation విధాత‌: కొవిడ్‌ సంక్షోభం ప్రపంచానికి అనేక పాఠాలు నేర్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఫలితంగా వాణిజ్య, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోత విధించాయి. దీనికితోడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి. కోవిడ్‌ సంక్షోభ కాలంలో పారిశ్రామిక, సేవల రంగాల నుంచి ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా వ్యవసాయరంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింంది. ముఖ్యంగా దేశంలో సరళీకరణ విధానాలు అమలైన కాలం నుంచి పట్టణీకరణ, నగరీకరణ పెరిగినా.. […]

Employment Generation | ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలె..

Employment Generation

విధాత‌: కొవిడ్‌ సంక్షోభం ప్రపంచానికి అనేక పాఠాలు నేర్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఫలితంగా వాణిజ్య, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోత విధించాయి. దీనికితోడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి.

కోవిడ్‌ సంక్షోభ కాలంలో పారిశ్రామిక, సేవల రంగాల నుంచి ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా వ్యవసాయరంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింంది. ముఖ్యంగా దేశంలో సరళీకరణ విధానాలు అమలైన కాలం నుంచి పట్టణీకరణ, నగరీకరణ పెరిగినా.. ఇంకా 65 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నది.

ఉపాధి కోసం వలస బాట పట్టినవాళ్లు కూడా కరోనా కాలంలో గ్రామాల బాట పట్టారు. అరకొర జీతాలతో కుటుంబ పోషణ భారమైన వారంతా ఉన్న ఊళ్లలోనే ఉపాధి దొరికితే ఆలుమగలు ఇద్దరూ పని చేసుకున్నా హాయిగా జీవించవచ్చు అనే ఆలోచనకు వచ్చారు. అందుకే ఉంటున్న ఊళ్లలోనే ఉపాధి హామీ పథకం కింద పనిచేసుకుంటూ.. ఉన్న ఎకరం, అరెకరం పొలం సాగు చేసుకుంటున్న కుటుంబాలే దేశంలో, రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి.

కొవిడ్‌ నుంచి కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఇంకా ఆ ప్రమాదం పూర్తిగా తొలిగిపోలేదని, భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొవిడ్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నట్టు లేదు. దీన్ని పట్టించుకోవడం లేదు.

దేశ ఆర్థిక రంగాన్ని కాపాడుతున్న, ఆహార భద్రతను కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఎరువులు, విత్తనాల సబ్సిడీలు ఎత్తివేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయకుండా వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. అలాగే ఉపాధి హామీకి ఏటా నిధులు తగ్గిస్తూ.. ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నది.

పంటల మద్దతు ధర అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. దీనిపై ఒక శాస్త్రీయమైన అధ్యయనం లేకుండా వరి, మక్కజొన్న లాంటి పంటలకు అరకొరగా మద్దతు ధర పెంచి దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్నది.

కరోనా కాలంలో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టపోయిన ప్రజానీకానికి ఉపశమనం కలిగించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం లేదు. సంక్షేమం పేరుతో ఓట్ల రాజకీయాల వేటలో ఆచరణసాధ్యం కాని హామీలను ఇస్తున్నాయి.

ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే మంచిదే. కానీ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారే అనేక విధానాలు తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలు తాత్కాలికంగా ఆయా పార్టీలకు ప్రయోజనం కలిగించవచ్చు. కానీ దీర్ఘాకాలంలో చాలా నష్టం చేస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారించాలి.

ఓట్ల కోసమో, రాజకీయ లబ్ధి కోసం తీసుకునే విధానాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. కనుక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అది దేశానికి, రాష్ట్రానికి మేలు చేస్తుంది.