Canada | కెనడాలో తగలబడుతున్న 4 లక్షల హెక్టార్ల అడవులు
అంతర్జాతీయ సమాజాన్ని సాయం అర్థించిన ట్రూడో న్యూయార్క్‌లో కమ్మేసిన పొగ, బయటకు రావొద్దని హెచ్చరికలు పర్యావరణ పరంగా ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు విధాత: కెనడా (Canada) లోని క్యూబెక్ ప్రావిన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు (Wiled Fires) లు అమెరికా ఖండాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాయి. సుమారు 4,60,00 హెక్టార్ల అడవి తగలబడుతూ చరిత్రలో కనివినీ ఎరగని విపత్తును సృష్టించింది. దీంతో అమెరికా(America)లోని న్యూయార్క్ సహా చాలా నగరాలు దట్టమైన పొగలతో నిండిపోయాయి. ఇప్పటి వరకు సుమారు […]

- అంతర్జాతీయ సమాజాన్ని సాయం అర్థించిన ట్రూడో
- న్యూయార్క్‌లో కమ్మేసిన పొగ, బయటకు రావొద్దని హెచ్చరికలు
- పర్యావరణ పరంగా ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు
విధాత: కెనడా (Canada) లోని క్యూబెక్ ప్రావిన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు (Wiled Fires) లు అమెరికా ఖండాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాయి. సుమారు 4,60,00 హెక్టార్ల అడవి తగలబడుతూ చరిత్రలో కనివినీ ఎరగని విపత్తును సృష్టించింది. దీంతో అమెరికా(America)లోని న్యూయార్క్ సహా చాలా నగరాలు దట్టమైన పొగలతో నిండిపోయాయి. ఇప్పటి వరకు సుమారు 11,400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు.
ఇంకా కొన్ని వేల మంది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. మే లో మొదలైన ఈ రాకాసి కార్చిచ్చులు క్రమంగా కెనడా అమెరికా సరిహద్దుల వైపు ప్రయాణిస్తున్నాయి. సుమారు 450 కార్చిచ్చులు క్రియాశీలకంగా ఉండగా.. తమ దగ్గర 40 కార్చిచ్చులతో పోరాడే వనరులు ఉన్నాయని కెనడా అధికారులు తెలిపారు. వాటిలో 110 తమ చేయి దాటిపోయాయని.. వాటిని మానవమాత్రులు నిలువరించలేరని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విపత్కర స్థితుల్లో తమకు అండగా నిలవడానికి అమెరికా ఫైర్ ఫైటర్లు పంపిస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం 600 మంది ఫైటర్లు వచ్చారని ఇంకా తగిన సాయం అందజేస్తామని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) హామీ ఇచ్చినట్లు ట్రూడో తెలిపారు. అలాగే అంతర్జాతీయ సమాజాన్ని సైతం కెనడా సాయం కోరింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాల నుంచి 1000 మంది ఫైటర్లు (Fire Fighters) కెనడాకు చేరుకున్నారు.
Hundreds of American firefighters have recently arrived in Canada, and more are on the way. On the phone today, I spoke with @POTUS Biden about this critical support – and I thanked him for all the help Americans are providing as we continue to fight these devastating wildfires.
— Justin Trudeau (@JustinTrudeau) June 7, 2023
ఎండిన అడవులతో విధ్వంసం
ఎండిపోయిన అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లడంతో.. కెనడాలో అడవులు పెద్ద ఎత్తున్న తగలబడుతున్నాయి. పశ్చిమ కెనడాలోని ఆల్బర్టా ప్రావిన్స్‌లో మొదలైన ఈ విధ్వంసం.. ఇప్పుడు ప్రపంచానికి ముప్పుగా పరిణమించింది. తాము సహాయక చర్యలు చేపడుతున్న ప్రాంతంలో చెట్లకు ఒక్క పచ్చని ఆకు కూడా లేదని.. అలాంటికి అగ్నికి ఆహుతి కాకుండా ఎలా ఆపాలో తెలియడం లేదని ఒక అధికారి వాపోయారు. ఈ కార్చిచ్చులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
పొగలో న్యూయార్క్ నగరం..
కెనడా కార్చిచ్చుల నుంచి వస్తున్న పొగతో న్యూయార్క్ (New York)నగరం అతలాకుతలమవుతోంది. ప్రజలెవరూ బయటి ప్రయాణాలు పెట్టుకోవద్దని సాధ్యమైనంత మేర ఇళ్లలోనే ఉండాలని నగర అధికారులు పౌరులకు సూచించారు. పొగ చూరిన నగరంలో గాలి నాణ్యత అథఃపాతాళానికి పడిపోయింది. ఉదయిస్తున్న సూర్యుడు చిన్న సైజు డిస్కులా కనిపించాడని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. మామూలు పరిస్థితుల్లో పెద్ద సూర్యగోళం కనువిందు చేసేదని తెలిపాడు. వెచ్చగా మారిన వాతావరణం, నారింజ రంగులోకి మారిపోయిన ఆకాశంతో నగర ప్రాంతాలన్నీ వేరే లోకాన్ని తలపిస్తున్నాయి. ఇది కనీవినీ ఎరగని విపత్తు అని న్యూయార్క్ మేయర్ అభివర్ణించారు. ‘ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లో కూర్చోవడమే ఏకైక మార్గం. ఈ పరిస్థితిని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోద్దు. ఆ వయసు వాళ్లు ఈ వయసు వాళ్లని కాదు.. ఎవరికీ ఈ వాతావరణం సురక్షితం కాదు’ అని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ హెచ్చరించారు. మరోవైపు కెనడాతో సరిహద్దు పంచుకుంటున్న 12కిపైగా రాష్ట్రాలు తమ పౌరులకు అలెర్ట్ జారీ చేశాయి.