R. Narayana Murthy: పవన్, దుర్గేష్ వ్యాఖ్యలపై ఆర్. నారాయణ మూర్తి కౌంటర్

వీళ్లు కలవలేదు సరే..మీరెందుకు పిలవలేదు
పవన్ వ్యాఖ్యలపై ఆర్. నారాయణ మూర్తి కౌంటర్
బంద్ ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం
సింగిల్ థియేటర్లకు పర్సెంటీజీ ఇవ్వాలి
కార్పోరేట్ సిస్టమ్ లకు వంత పాడొద్దు
పవన్ సినిమాను ఆపే దమ్ము ఎవరికి లేదు
టికెట్ ధరల పెంపు కారణంగానే ఓటీటీ వైపు ప్రేక్షకులు
ఏపీలోనూ నంది అవార్డులు ఇవ్వాలి
విధాత : సినీ పరిశ్రమలో ఆర్.నారాయణ మూర్తి రూటే సపరేట్..ఆయన సినిమాల మాదిరిగానే ఆయన వ్యవహారశైలీ విభిన్నం..విప్లవాత్మకం. ఇటీవల ఆంగ్ల విద్య ఆవశ్యకతపై సంచలన వ్యాఖ్యలతో అందరిని విస్మయపరిచిన నారాయణమూర్తి..తాజాగా సినిమా థియేటర్ల బంద్ వివాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా శనివారం మీడియా సమావేశంలో తనదైన శైలీలో ముక్కుసూటిగా స్పందించారు. ఏపీలో క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు ఎవరు కూడా సీఎం చంద్రబాబును, ప్రభుత్వాన్ని కలవకపోవడం సరికాదంటూ పవన్ కల్యాణ్, దుర్గేష్ లు చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి మీరు కూడా ఎందుకు పరిశ్రమ ప్రతినిధులను పిలిచి మీ సమస్యలేమిటో చెప్పడంటూ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. మీరు రాజులు మీరు చెప్పినట్లే కలుస్తాం.. కానీ పూర్వకాలంలో ప్రజల దగ్గరికే రాజులు వచ్చి వాళ్ళ సమస్యలు వినేవారని..ధర్మగంట కొడితే స్పందించి ప్రజాసమస్యలు పరిష్కరించే వారని ..మరి మీరు కూడా ఇండస్ట్రీ ప్రతినిధులను పిలిచిమాట్లాడితే మేం కూడా ఆనందపడేవాళ్లమని..పవన్ గౌరవం మరింత పెరిగేదని నారాయణమూర్తి చురకలేశారు.
ప్రజాస్వామ్యంలో బంద్ బ్రహ్మాస్త్రం
థియేటర్ల బంద్ పిలుపుకు పవన్ సినిమా హరిహర వీరమల్లుకు ముడిపెట్టడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో బంద్ బ్రహ్మాస్త్రమని..సింగిల్ థియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం ఉండాలనుకునే వారిలో నేను ఉన్నానని..గతంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ధర్నా చేశామని గుర్తు చేశారు. బంద్ పిలుపు ఇవ్వాలనుకుంటే నిబంధనల మేరకు నిర్మాతలకు మూడు వారాల ముందే తెలియచేయాలని..రిలీజ్ డేట్ లు ప్రకటించిన సినిమాల నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. పర్సంటేజీల సమస్య ఓ కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లు కు సమస్యను లింక్ పెట్టడం సరికాదన్నారు. విషయాన్ని పక్కదారి పట్టించకుండా…కార్పేరేట్ సిస్టమ్ కు వంత పాడకుండా ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్ పై కుట్ర చేసి..ఆయన సినిమాను ఆపే సాహసం ఎవరు కూడా చేయలేరన్నారు.
పర్సంటేజీతో సింగిల్ థియేటర్లను బతికించాలి..టికెట్ ధరల పెంపు సరికాదు
కార్పోరేట్ సిస్టమ్ తో సింగిల్ థియేటర్లు తగ్గిపోతున్నాయని..దేవాలయాల్లాంటి సింగిల్ థియేటర్లు కల్యాణ మండపాలుగా మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్సంటేజీతో వాటిని, నిర్మాతలను బతికించాలని కోరారు. పర్సంటేజీల మీద సినిమాలు రిలీజ్ చేస్తేనే ఇండస్ట్రీకి, నిర్మాతలకు మంచిదని స్పష్టం చేశారు. ఓటీటీలో ప్రేక్షకులు సినిమాలు చూస్తే పరిశ్రమ నాశనమవుతుందన్నారు. ఇందుకు పరిశ్రమ, ప్రభుత్వం కూడా కారణమన్నారు. సినిమా టికెట్ ధరల పెంపుతో ప్రేక్షకులు థియేటర్ల వైపు రాకుండా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. వినోదం ఖరీదుగా మారిపోవడంతో చివరకు హీరోల అభిమానులు కూడా టికెట్ల ధర భరించలేక ఓటీటీతో సరిపెట్టుకుంటున్నారని వివరించారు. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబైనప్పటికి..ఆ ఖర్చును ప్రజలపై రుద్దకూడదని..హాలీవుడ్ లోనూ వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారని టికెట్ ధరలు పెంచడం లేదని తెలిపారు. గతంలో మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం వంటి భారీ సినిమాలు వచ్చాయని..వాటి కోసం ధరలు పెంచలేదు కదా అని గుర్తు చేశారు. తెలుగులో లవకుశ వంటి పెద్ద సినిమాను ఐదేళ్లు తీశారని..ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదన్నారు. సినిమాలు బాగుంటే ప్రజలు వస్తారని స్పష్టం చేశారు.
ఏపీ కూడా నంది అవార్డులు ప్రకటించాలి
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ఇవ్వడం పట్ల తాను గర్వపడుతున్నానని..ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని నారాయణమూర్తి తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలని కోరారు.