ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌పై గవర్నర్‌కు రఘునందన్‌రావు ఫిర్యాదు

రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎన్నికల్లో బీఆరెస్‌ తరఫున ప్రచారం చేశారని రఘునందన్ రావు, గవర్నర్ తమిళి సైకి ఫిర్యాదు

  • By: Somu |    latest |    Published on : Dec 22, 2023 10:43 AM IST
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌పై గవర్నర్‌కు రఘునందన్‌రావు ఫిర్యాదు

విధాత: రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ తరఫున ప్రచారం చేశారని ఆరోపిస్తు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శుక్రవారం గవర్నర్ తమిళి సైకి ఫిర్యాదు చేశారు. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించిందని, అతని భార్య సర్పంచ్ గా కూడా వ్యవహరిస్తోందన్నారు.


రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగుతూ వెంకటయ్య ఎన్నికల్లో బీఆరెస్‌ తరఫున ప్రచారం చేశారని, ఓటర్లను ప్రలోభ పెట్టారని అందుకు సంబంధించిన ఆధారాలతో తాను గవర్నర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. అధికార హోదా దుర్వినియోగానికి పాల్పడిన వెంకటయ్యను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. తన విజ్ఞప్తిపై గవర్నర్ స్పందిస్తూ సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేస్తానని చెప్పినట్లు తెలిపారు.