అంట్లు తోమిన రాహుల్‌గాంధీ.. ఎక్కడంటే..

- పంజాబ్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ
- పూజలు.. సేవ కింద గిన్నెల పరిశుభ్రం
- రేపు పల్లకీ సేవలో పాల్గొనే అవకాశం
పంజాబ్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ సోమవారం పంజాబ్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. సచ్‌ఖండ్ శ్రీ హర్మిందర్ సాహిబ్‌లో పూజలు చేసేందుకు రాహుల్‌గాంధీ వచ్చారని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్‌సింగ్ రాజా వార్రింగ్ చెప్పారు. ఇది ఆయన వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనని, ఆయన ఏకాంతతను గౌరవిద్దామని ట్వీట్ చేశారు. ఆయనను భౌతికంగా కలుసుకునేందుకు పార్టీ కార్యకర్తలు రావొద్దని విజ్ఞప్తి చేశారు. స్వర్ణ దేవాలయంలో పూజలు చేస్తున్న ఫొటో, అనంతరం అఖల్‌తఖ్త్‌లో స్వచ్ఛంద సేవలో భాగంగా ఇతర భక్తులతో కలిసి గిన్నెలు కడుతున్న ఫొటోలు పంచుకున్నారు.
మంగళవారం ఉదయం పల్లకీ సేవలో కూడా రాహుల్ పాల్గొంటారని తెలుస్తున్నది. ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు నేపథ్యంలో అధికార ఆప్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నది. ఈ సమయంలో ఆయన రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆప్‌తో పొత్తును స్థానిక కాంగ్రెస్ నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో చివరిసారి భారత్ జోడో యాత్ర పంజాబ్‌లో ప్రారంభానికి ముందు రాహుల్‌గాంధీ స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు.