• Telugu News
  • /Devotional

Maha Shivaratri| మహాశివరాత్రి పూజలతో శివాలయాల కిటకిట

మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా తెలుగు రాష్ట్రాలలోని శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. శివార్చనలు, రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలతో .. శివనామస్మరణాలతో శివాలయాలు మారుమ్రోగాయి.

Reported by: Y.V. Narsimha Reddy | ఆధ్యాత్మికం | Feb 15, 2026, 10:45 am IST
Read Time: 4 mins
Maha Shivaratri|  మహాశివరాత్రి పూజలతో శివాలయాల కిటకిట

విధాత : మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా తెలుగు రాష్ట్రాలలోని శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. శివార్చనలు, రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలతో .. శివనామస్మరణాలతో శివాలయాలు మారుమ్రోగాయి. ప్రసిద్ద జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్బంగా భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తజనం తరలివచ్చింది. భక్తులతో శ్రీశైలం మహా క్షేత్రం కిక్కిరిసింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకునేందుకు వేకువజామున నుంచే భక్తులు బారులు తీరారు.
శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉభయగోదావరి పంచరామ శైవ క్షేత్రాలు మహాశివరాత్రి భక్తుల రద్దీతో సందడిగా మారాయి. పల్నాడు అమరేశ్వరాలయం, సామర్ల కోట భీమేశ్వరాలయం, కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామిసోమేశ్వరాలయం, వేములవాడ తదితర ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రధాన ఆలయాల క్యూలైన్లు నిండిపోయాయి.

తెలంగాణలోని కీసరగుట్టలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేములవాడ భీమేశ్వరాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అభిషేకాది పూజలు నిర్వహించారు. నల్లగొండలోని ప్రసిద్ద ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా మేళ్వచెర్వు శంభులింగేశ్వర ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మహాశివరాత్రి పూజలలో పాల్గొన్నారు. గోదావరి, కృష్ణానది తీరంలోని కాళేశ్వరం, వాడపల్లి అగస్తేశ్వర ఆలయాల్లో భక్తజనం పోటెత్తారు. మహాశివరాత్రి సందర్బంగా రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం, లింగోద్బవం ఘట్టాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు, అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టాయి.