Rahul Gandhi | అమేథీ నుంచే రాహుల్‌ పోటీ.. కోరుకున్న చోట ప్రియాంక

Rahul Gandhi | యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వెల్లడి మళ్లీ స్మృతి వర్సెస్‌ రాహుల్‌ లక్నో: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌రాయ్‌ శుక్రవారం స్పష్టం చేశారు. యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమితులైన మరుసటిరోజే అజయ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. దీంతో ఇక్కడ మరోసారి స్మృతి ఇరానీకి రాహుల్‌గాంధీ పోటీ తథ్యంలా కనిపిస్తున్నది. అమేథీ నుంచి ప్రియాంక […]

  • By: krs    latest    Aug 18, 2023 2:57 PM IST
Rahul Gandhi | అమేథీ నుంచే రాహుల్‌ పోటీ.. కోరుకున్న చోట ప్రియాంక

Rahul Gandhi |

  • యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వెల్లడి
  • మళ్లీ స్మృతి వర్సెస్‌ రాహుల్‌

లక్నో: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌రాయ్‌ శుక్రవారం స్పష్టం చేశారు. యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమితులైన మరుసటిరోజే అజయ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

దీంతో ఇక్కడ మరోసారి స్మృతి ఇరానీకి రాహుల్‌గాంధీ పోటీ తథ్యంలా కనిపిస్తున్నది. అమేథీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై అజయ్‌రాయ్‌ స్పందిస్తూ.. ‘ఆమె కోరుకున్న చోటు నుంచి పోటీ చేయవచ్చు. వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేయాలని ప్రియాంక భావిస్తే.. ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త ఆమె విజయానికి కృషి చేస్తారు’ అని చెప్పారు.

2019లో వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేస్తారని అనుకున్నా.. ఆఖరు నిమిషంలో అజయ్‌రాయ్‌ అక్కడ పోటీ చేశారు. అంతకు ముందు 2014లో కూడా అజయ్‌రాయ్‌ వారణాసి నుంచే పోటీ చేశారు. సృతి ఇరానీ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఆమె వాగ్దానం చేసిన విధంగా కిలో చక్కెర 13 రూపాయలకే వస్తున్నదా? అని ఆమెను అడగండి’ అని మీడియాకు సూచించారు.

దీనికి ఆమె సమాధానం చెప్పాల్సిందేనన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్‌గాంధీ అమేథీ, కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీచేశారు. అమేథీలో పరాజయం పాలవ్వగా.. వాయనాడ్‌లో గెలిచారు. మరి కీలక సమయంలో తనను ఆదరించిన వాయనాడ్‌ను వదిలేసి అమేథీకి మారుతారా? అనేది వేచిచూడాలి.

ఇదిలా ఉంటే.. అజయ్‌రాయ్‌ వ్యాఖ్యలకు ముందే ప్రియాంక భర్త రాబర్ట్‌వాధ్రా.. ఆమె పార్లమెంటరీ రాజకీయ రంగ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చారు. ప్రియాంక గాంధీ లోక్‌సభకు వెళ్లేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నారని ఓ వార్త సంస్థకు చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.