Bhadrachalam Temple: రామ రామ.. భద్రాచలంలో ఇదేమి అపచారం!
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా జరిగే అతి పెద్ద వేడుక శ్రీరామ నవమి ఉత్సవాలు. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి..ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది.

Bhadrachalam Temple:
భద్రాచల రామయ్య శ్రీరామ నవమి వేడుకల ప్రారంభం వేళ చోటుచేసుకున్న పరిణామాలు వేడుకల అంకురార్పణ ఆరు గంటలు ఆలస్యానికి దారితీయడం చర్చనీయాంశమైంది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా జరిగే అతి పెద్ద వేడుక శ్రీరామ నవమి ఉత్సవాలు. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి..ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది.
వేడుకలకు అంకురార్పణ చేయాల్సిన అర్చక బృందం ఆలయ ఉప ప్రధాన అర్చకుడు లేనిది తాము అంకురార్పణ చేయమంటు భీష్మించారు. ఇటీవల ఓ భక్తుడు స్వామివారికి ఇచ్చిన నగదును ఆలయ ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజం స్వీకరించాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఈవో రమాదేవి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రెండు రోజుల క్రితం అతడిని పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి బదిలీ చేశారు. అయితే ఉప ప్రధాన అర్చకుడు లేకుండా తాము వేడుకలను నిర్వహించలేమని..శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీనివాస రామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని అర్చకులంతా ఈవో రమాదేవిని కోరారు. ఉప ప్రధాన అర్చకుడు లేకుండా శ్రీరామనవమి వంటి పెద్ద మహోత్సవాన్ని నిర్వహించడం కష్టమవుతుందని వివరించారు. ఆలయ కైంకర్యాలు చేయడానికి అతడిని అనుమతించాలని కోరారు.
శ్రీరామనవమి వేడుకలు ముగిసిన తరువాత అతడిని బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. అయితే దీనిపై ఈవో రమాదేవి నుంచి స్పందన లేకపోవడంతో నవమి వేడుకల అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులు నిరాకరించారు. ఉప ప్రధానార్చకుడి వివాదంపై అర్చకులకు, ఈవోకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు కిందిస్థాయి ఉద్యోగులు గురువారం రాత్రి వరకు గంటల తరబడి చర్చలు కొనసాగించారు. అంకురార్పణ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు అసహనం వ్యక్తంచేశారు.
చివరకు రాత్రి పది గంటల సమయంలో ఈవో రమాదేవి అర్చకుల వద్దకు వెళ్లి చర్చించారు. తప్పు చేసిన ఉప ప్రధాన అర్చకుడిని అర్చకులు వెనుకేసుకొని రావడం ద్వారా ఆలయ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటు ఉప ప్రధాన అర్చకుడు లేకుండా వేడుకలు జరపలేమని అర్చకులు తేల్చిచెప్పారు. ఎట్టకేలకు ఉప ప్రధాన అర్చకుడిని ఈవో పిలిపించారు. దీంతో ఆరు గంటలు ఆలస్యంగా రాత్రి పది గంటల సమయంలో అతడు అంకురార్పణ చేయడంతో నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో అర్చకుల తీరు చర్చనీయాంశమైంది. తాజాగా భద్రచల శ్రీరామ నవమి సందర్భంగా భక్తుల కోసం సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యం పురుగు పట్టడం కూడా వివాస్పదమైంది.