అడ్డుకున్న ఆ చేతులే రేవంత్‌కు సెల్యూట్.. రెడ్ కార్పెట్‌తో ఘనస్వాగతం..
తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం పాలమూరు ముద్దుబిడ్డ, సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం పాలమూరు ముద్దుబిడ్డ, సీఎం రేవంత్ రెడ్డి. బంతిని ఎంత బలంగా గోడకేసి కొడితే అంతే బలంగా తిరిగి వస్తుందనే దానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి. ఆయన రాజయకీ ప్రస్థానం అంతా ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లతో సాగి గమ్యాన్ని చేరుకున్న క్రమం ఎంతో ఆసక్తిరమే కాదు స్ఫూర్తిదాయకం కూడా.
తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెబుతూ హస్తం పార్టీకి అధికారం సాధించే స్థాయికి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. కష్టకాలంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి సీనియర్లను సమన్వయం చేసుకుంటూ.. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అధికారమై లక్ష్యంగా అడుగులు వేసి.. కుంభస్థలాన్ని కొట్టారు.
లక్ష్యం స్పష్టంగా ఉంటే గమ్యాన్ని చేరుకోవడం సులువుతుంది. అనుకున్నదాన్ని సాధించే క్రమంలో ఎన్నో అవంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకెళ్తే విజయం వరిస్తుందని చిన్నప్పటి నుంచే నమ్మే రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా తనను చెక్కుకుంటూ ముందుకెళ్లారు. ఉత్తుంగ తరంగంలా జనంలోకి దూసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
ఇదంతా ఒకవైపు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి గతంలో అవమానం ఎదురైంది. సచివాలయం దాకా కూడా కాదు.. టెలిఫోన్ భవన్ పరిసరాల్లోనే ఆయన్ను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఆయన్ను సచివాలయం గేటును తాకనీయకుండా ఘోరంగా అవమానించింది. కానీ, కాలం ఒకేలా ఉండదు కదా.
ఓడలు బండ్లు అయినట్లు, బండ్లు ఓడలు అయినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. ఏ చోటనైతే తనను మెడలు పట్టి బయటికి పంపారో అదే చోట రెడ్ కార్పెట్ పరిచి ఘన స్వాగతం పలికేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. బంతిని గోడకు ఎంత వేగంగా కొడితే అంతే వేగంగా తిరిగి వస్తుందన్నట్లుగా అవమానించిన చోటే సెల్యూట్ కొట్టించుకొని శభాష్ అనిపించుకున్నారు.
అవమానాలు ఎదురైన చోట అడుగు పెట్టిన రేవంత్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. రేవంత్‌ను చూడగానే సచివాలయ ఉద్యోగులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. రేవంత్ ఓ సీఎంలా కాకుండా, ఒక సామాన్యుడిలా ఉద్యోగులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సచివాలయం అంతటా కలియ తిరుగుతూ ఉద్యోగుల్లో భరోసా నింపారు.
ఎల్‌బీ స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి.. ఇది ప్రజా ప్రభుత్వం అని ఒక సందేశాన్ని పంపారు. అంతేకాదు.. అటు ప్రమాణస్వీకారం జరుగుతుంటే.. ఇటు ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను బద్దలు కొట్టించి.. ప్రజా దర్బార్‌కు సంకేతం పంపారు. దటీజ్ ఎనుముల రేవంత్ రెడ్డి.