ప్రజల బతుకు మార్చేందుకే ఈ దండయాత్ర: మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి
బొట్టు పెట్టి హారతులిచ్చిన కుటుంబ సభ్యులు పాదయాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డి.. మేడారంలో వనదేవతలకు రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక శ్రద్ధ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మేడారం నుంచి ప్రారంభమైంది. ములుగు జిల్లా మేడారంలో కొలువైన […]

- బొట్టు పెట్టి హారతులిచ్చిన కుటుంబ సభ్యులు
- పాదయాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డి..
- మేడారంలో వనదేవతలకు రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజ
- సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు
- భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
- ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక శ్రద్ధ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మేడారం నుంచి ప్రారంభమైంది. ములుగు జిల్లా మేడారంలో కొలువైన వన దేవతలు సమ్మక్క, సారలమ్మలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభమైంది. గత నాలుగు రోజులుగా జరిగిన మినీ మేడారం జాతర ఆదివారం ముగియగా సోమవారం మేడారంలో కాంగ్రెస్ జాతర ప్రారంభమైంది.
భారీ స్థాయిలో హాజరైన కాంగ్రెస్ నాయకులు శ్రేణుల సమరోత్సాహం మధ్య పాదయాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క నేతృత్వంలో వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. తమ నేత రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. శ్రేణుల ఉత్సాహం, డప్పు చప్పుడు మధ్య జోడో పాదయాత్ర మేడారం నుంచి ప్రారంభించారు. కాంగ్రెస్ జిందాబాద్, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ కార్యకర్తల నినాదాల మధ్య యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంతః మాట్లాడుతూ తెలంగాణ ప్రజల బతుకు మార్చేందుకు దొర పాలనపై దండయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రారంభమైన జోడో యాత్ర
మేడారం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రెండు రోజులపాటు ములుగు జిల్లాలో సాగనున్నది. మేడారం నుంచి పాద యాత్ర కొత్తూరు, నార్లాపూర్, మీదుగా ప్రాజెక్టు నగర్ చేరుకుని ప్రాజెక్టునగర్లో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు.
భోజనం అనంతరం యాత్ర ప్రారంభించి పస్రా చేరుకుంటారు. సాయంత్రం పస్రాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. అనంతరం పస్రా, గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్, జవహర్ నగర్, జంగాలపల్లి క్రాస్ రోడ్ మీదుగా ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ రోడ్ మీదుగా పాలంపేట చేరుకుని రాత్రి బస చేస్తారు.
రేవంత్‌కు కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జూడో అభియాన్లో భాగంగా ములుగు జిల్లా మేడారం నుంచి చేపట్టనున్న పాదయాత్ర కోసం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి బయలుదేరారు. రేవంత్ రెడ్డికి ఆయన కూతురు, కుటుంబ సభ్యులు బొట్టుపెట్టి హారతులు ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
హైదరాబాద్ నుంచి పాదయాత్ర కోసం మేడారం బయలుదేరిన రేవంత్ రెడ్డికి బీబీనగర్, భువనగిరి, ఆలేరు, జనగామల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యకర్తల జయజయ ద్వానాల మధ్య భారీ కాన్వాయ్‌తో ఆయన ముందుకు కదిలి మేడారం చేరుకున్నారు.
సమ్మక్క సారక్కలకు పూజలు
ములుగులోకి ప్రవేశించే ముందు గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు చేసి మేడారం బయలుదేరారు. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల వద్ద రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో అతిపెద్ద జాతరగా ఖ్యాతినొందిన మేడారం సమ్మక్క సారక్క నుంచి సెంటిమెంట్ గా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. రేవంత్ పాదయాత్ర సుమారు 50 నియోజకవర్గాల మీదుగా కొనసాగేలా కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది.
రోడ్డు పొడవునా స్వాగత బ్యానర్లు..
మేడారంలో వనదేవతల సందర్శన అనంతరం యాత్ర ప్రారంభించారు. రేవంత్ వెంట ఎమ్మెల్యే సీతక్క మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, ఇతర రాష్ట్ర నాయకులు ఉన్నారు. యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలతో రోడ్డు పొడవుతా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. యాత్రకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.