Revanth Reddy | కేసీఆర్‌ది డేంజరస్‌ మోడల్‌.. కరోనా కంటే ప్రమాదకరం: రేవంత్‌రెడ్డి

కరోనా కంటే ఆయన ప్రమాదకర వైరస్.. కాంగ్రెస్‌ ఫ్రీడం ఫైట్‌ మోడల్‌ తెస్తే.. మోదీ కార్పొరేట్‌ మోడల్‌ తెచ్చారు కేసీఆర్‌ వద్ద భూ మాఫియా సొమ్ము దానితో దేశాన్ని ఏలాలని చూస్తున్నారు కేసీఆర్‌ భూ దోపిడిని సీరియల్‌గా విడుదల చేస్తాం కేసీఆర్ కోట గోడలు బీటలుబారుతోంది గాంధీభవన్‌లో మీడియాతో రేవంత్‌రెడ్డి విధాత : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్తున్న మోడల్‌ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకారి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి […]

Revanth Reddy | కేసీఆర్‌ది డేంజరస్‌ మోడల్‌.. కరోనా కంటే ప్రమాదకరం: రేవంత్‌రెడ్డి
  • కరోనా కంటే ఆయన ప్రమాదకర వైరస్..
  • కాంగ్రెస్‌ ఫ్రీడం ఫైట్‌ మోడల్‌ తెస్తే..
  • మోదీ కార్పొరేట్‌ మోడల్‌ తెచ్చారు
  • కేసీఆర్‌ వద్ద భూ మాఫియా సొమ్ము
  • దానితో దేశాన్ని ఏలాలని చూస్తున్నారు
  • కేసీఆర్‌ భూ దోపిడిని సీరియల్‌గా విడుదల చేస్తాం
  • కేసీఆర్ కోట గోడలు బీటలుబారుతోంది
  • గాంధీభవన్‌లో మీడియాతో రేవంత్‌రెడ్డి

విధాత : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్తున్న మోడల్‌ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకారి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ఫ్రీడం ఫైట్‌ మోడల్‌ను అందిస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ మోడల్‌ను తీసుకువచ్చి.. ప్రజల సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ.. ఈ దేశ రాజకీయాలను కార్పొరేట్‌ మోడల్‌గా మార్చేస్తే.. మరోవైపు కేసీఆర్‌ ఎన్నికల నిర్వహణ కోసం వేల కోట్లు సమకూరుస్తానని అంటున్నారని విమర్శించారు.

కర్ణాటకలో జేడీయూకు వందలకోట్లు ఖర్చు పెట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘తెలంగాణ చరిత్రను గమనిస్తే.. భూమి కేంద్రంగానే పోరాటాలు జరిగాయి. భూమి కన్నతల్లి.. భూమి ఆత్మగౌరవం, సాయుధ రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు భూమి కోసమే జరిగాయి. అలాంటి రాష్ట్రంలో కేసీఆర్ భూ దోపిడీకి పాల్పడ్డారు. భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు వెనకేసుకున్నాడు. భూ మాఫియా ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు’ అని ఆయన చెప్పారు.

కరోనా సమయంలో కోట్లు వెనకేసిన హెటిరో

కేసీఆర్‌కు హెటిరో పార్థసారథి అత్యంత సన్నిహితుడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన కరోనా సమయంలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని విమర్శించారు. ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాల్లో 142 కోట్ల సొమ్ము దొరికింది. పార్ధసారథి రెడ్డి ఇన్‌కం ట్యాక్స్, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పార్థసారథి రెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ కు భూములు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. నిబంధనలకు విరుద్ధంగా సాయి సింధు సంస్థకు హైటెక్ సిటీ దగ్గరలో 15 ఎకరాలు కేటాయించారు’ అని రేవంత్‌రెడ్డి వివరించారు.

అగ్గువకే కట్టబెట్టారు

ఎకరానికి 33 కోట్ల 70లక్షలు అని రంగారెడ్డి కలెక్టర్ విలువ కట్టారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘సీఎస్ 15 ఎకరాలు అక్కర్లేదు.. 10 ఎకరాలు చాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 571 జీవో 2012, 281జీవో, 2015లో కొత్త జీవో ప్రకారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి 15 ఎకరాలకు 1500 కోట్లు ఉంటే.. 505 కోట్లు మాత్రమే విలువ కట్టారు. 10శాతం రెంట్ వసూలు చేయాలంటే ఏడాదికి 50కోట్లు వసూలు చేయాలి. 281 జీవో ప్రకారం కొత్తగా మార్కెట్ విలువ ప్రకారం రెంటల్ వ్యాల్యూ వసూలు చేయాలి. 2018లో 59జీవో సాయి సింధు ఫౌండేషన్ కు 15 ఎకరాలు కేటాయించింది’ అని ఆయన వివరించారు.

కానీ 50 కోట్ల రెంట్ వసూలు చేయకుండా 15 ఎకరాలకు మొత్తం 1లక్షా 50వేల ప్రకారం పార్థసారధి రెడ్డికి కేసీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు. 60 ఏళ్లకు 1.40 కోట్లు వస్తోంది… కానీ ప్రభుత్వ భూమి విలువ ప్రకారం 5,346 కోట్లు రావాలన్నారు. ఇంత విలువైన భూమిని 1.40కోట్లకు కట్టబెట్టారన్న రేవంత్‌రెడ్డి.. ఇంతకంటే దోపీడీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలు కాదని కేసీఆర్ చౌకగా భూములు కట్టబెట్టారని మండిపడ్డారు. పేదల ప్రాణాలపై కరోనా సమయంలో వ్యాపారం చేసిన పార్థసారథి రెడ్డికి విలువైన భూమి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ భూ దోపిడిని సీరియల్‌గా..

కేసీఆర్ భూ దోపిడీని సీరియల్ గా విడుదల చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూ దోపిడీ తో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడని మండిపడ్డారు. బీజేపీ కార్పొరేటర్ మోడల్ తీసుకొస్తే.. కేసీఆర్ మాఫియా మోడల్ తీసుకొచ్చారని విమర్శించారు. ‘కేసీఆర్ కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్.. అప్రమతంగా లేకపోతే మాఫియా మోడల్ రాజకీయాల్లో బలి కావాల్సి వస్తుంది. మోదీని వదిలేస్తే పరిస్థితి ఎలా తయారైందో.. కేసీఆర్‌ను వదిలేస్తే భవిష్యత్‌లో మాఫియా నీడన బతకాల్సి వస్తుంది’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

జాతీయ పార్టీలూ.. కేసీఆర్‌ను రానీయకండి

కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో దరిదాపుల్లోకి రాకుండా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను వదిలించుకోవాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాస్తామని తెలిపారు. ‘2లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలోనే కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేశారు. 47లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే అత్యంత ప్రమాదకరం. రాజకీయాల్లో కరుడు గట్టిన నేరగాడు, రాజకీయ జూదగాడు జాతీయ రాజకీయాల్లోకి రావడం ప్రమాదకరం’ అని ఆయన పేర్కొన్నారు.

ఆ ఏడుగురికీ జైలు తప్పదు

కేసీఆర్ దోపిడీకి సహకరించిన ఆ ఏడుగురు అధికారులు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆరు నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని, ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సోమేశ్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్‌లు జైలుకు పోక తప్పదని అన్నారు.

ఖానామెట్‌లో మాఫియాకు 60 ఎకరాలు

ఖానామెట్‌లోని 41 సర్వే నెంబర్ లో 150 ఎకరాల భూమి ఉండేదని, అందులో కేసీఆర్ 60 ఎకరాలు మాఫియాకు కట్టబెట్టారని ఆరోపించారు. రేపు యశోదా హాస్పిటల్ కొల్లగొట్టిన భూములపై వివరాలు చెబుతానన్న రేవంత్‌రెడ్డి.. ఖానామెట్ భూములపై ధారావాహికగా వివరాలు విడుదల చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారిపై తన సానుభూతి ఎప్పుడూ ఉంటుందన్న రేవంత్‌.. పొంగులేటి, జూపల్లి తిరుగుబాటు జెండా ఎగరేశారని, కేసీఆర్ కోట గోడలు బీటలుబారుతోందని వ్యాఖ్యానించారు.