రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తంలో మార్పు
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ముహూర్తంలో మార్పు చోటు చేసుకుంది. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

విధాత : సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ముహూర్తంలో మార్పు చోటు చేసుకుంది. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత రేపు ఉదయం 10.28 గంటలకు నిర్వహించాలని భావించారు. అటు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాలు అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఉత్తమ్, భట్టిలకు బుజ్జగింపు
గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సోమవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశం సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను హై కమాండ్‌కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం పదవికి తమ పేర్లను కూడా పరిశీలించాలంటూ సీనియర్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తమ వర్గీయులతో కలిసి ఒత్తిడి పెంచారు. పరిశీలకులుగా వ్యవహరించిన డీకే శివకుమార్, ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే.. ఈ సమస్యను పార్టీ హైకమాండ్‌కు నివేదించారు. దీంతో పరీశీలకులతో పాటు ఉత్తమ్, భట్టిలను ఢిల్లీకి పిలిపించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్.. ఉత్తమ్, భట్టిలతో వేర్వేరుగా భేటీయై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. డీకే శివకుమార్, ఠాక్రే అందించిన నివేదికలు తీసుకుని, వారి అభిప్రాయాలు కూడా విన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇస్తే బాగుంటుందని భావించిన ఖర్గే, రాహుల్, వేణుగోపాల్.. ఉత్తమ్, భట్టిలను బుజ్జగించారు. వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సాయంత్రం 6.35గంటలకు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించి సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారని వెల్లడించారు. ఈ ప్రకటనకు ముందు హైదరాబాద్‌లో ఉన్న రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు. రాత్రికి గాని, బుధవారం ఉదయంగాని రేవంత్, ఉత్తమ్, భట్టిలను కలిపి వారి మధ్య సయోధ్య సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాట్లు చేసింది.