Revanth Reddy | రేవంత్​ ఇక మాజీ ముఖ్యమంత్రేనా? – తప్పదంటున్నది కాంగ్రెస్​ వర్గాలే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీగండముందని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి చేసని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. స్థానిక బిజేపీ ఎమ్మెల్యేకే ఇంత సమాచారముంటే మరి హైకమాండ్​తో అంటకాగే కాంగ్రెస్​ నేతలేమంటున్నారు?

Revanth Reddy | రేవంత్​ ఇక మాజీ ముఖ్యమంత్రేనా? – తప్పదంటున్నది కాంగ్రెస్​ వర్గాలే

REVANTH REDDY | తెలంగాణ బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Yeleti Maheshwar Reddy),  త్వరలోనే తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నారంటూ ఓ బాంబు పేల్చారు.  ఇది ఎంతవరకు నిజమన్నది పక్కనబెడితే, మహేశ్వర్​రెడ్డి మాత్రం ‘చూడండి… మీకే తెలుస్తుంది, నాకున్నది పక్కా సమాచారమ’ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్​ శ్రేణులు, ముఖ్యంగా రేవంత్​ అనుచరగణం అందుబాటులో ఉన్న నేతల వద్దకు పరుగులు తీస్తూ ఇందులో నిజమెంతా అని ఆరా తీస్తున్నారు. అయితే కాంగ్రెస్​ హైకమాండ్​తో టచ్​లో ఉండే సీనియర్​ నాయకులు, రేవంత్​ పొడ అసలే గిట్టని నేతలు ఇప్పటికే రాహుల్​గాంధీ(Rahul Gandhi)కి చేరవేయాల్సిందంతా చేరేసారని విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) రేవంత్ రెడ్డికి శత్రువులు మరెవరో కాదు, స్వయానా ఆయన క్యాబినెట్​లో ఉన్న మంత్రులేననేది రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలకు తెలిసని నగ్నసత్యం. కారణం, వారందరూ ముందునుండీ కాంగ్రెస్​లోనే ఉన్నవారు కావడం. అందులో కొందరు అప్పటికే రాజకీయాల్లో కనుమరుగైపోయినవారు కూడా. అయితే వారికి నచ్చినా, నచ్చకపోయినా, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది రేవంత్​ వల్లేనన్నది ఆయన వర్గం మాట. కేసీఆర్​(KCR) స్వయంకృతాపరాధాలవల్లే, ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్​ గెలిచిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు రేవంత్​ స్వయంకృతాపరాధాలే ఆయనను పదవి నుండి దించేయబోతున్నాయనేది బిజేపీ మాట. ఇందులో మాత్రం వాస్తవమున్నది. పాలన పట్ల ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి, మంత్రుల వల్ల రాష్ట్రం అథోగతి పాలవుతోంది. హైడ్రా(HYDRAA), మూసీ(Musi), రుణమాఫీ, రైతుబంధు బందు, ఆరు గ్యారెంటీలు రేవంత్​ పుట్టి ముంచాయి. అన్నింటికంటే ముఖ్యంగా కేసీఆర్​ను దారుణంగా తిట్టడమనేది(Abusing KCR) బాగా దెబ్బతీసింది.

ఈ విషయాలన్నీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సవివరంగా తెలియడంతో రేవంత్​పై ఆయన తీవ్ర అసంతృప్తితో వున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏడుసార్లు డిల్లీకి వెళ్లినా రాహుల్ అపాయింట్​మెంట్​ దొరకక తిరిగివచ్చారని తెలిపారు. దీన్నిబట్టి రేవంత్ ను రాహుల్ దూరం పెట్టారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇంకోపక్క రేవంత్ వయనాడ్ వెళ్లినా ప్రియాంక(Priyanka Gandhi) కూడా కలవలేదట. ఇవన్నీ రేవంత్​రెడ్డికి మూడిందని తెలియడానికి సంకేతాలుగా మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.
విచిత్రంగా, గాంధీభవన్(Gandhi Bhavan)​లో కూడా ఇదే చర్చ జరుగుతుండటం. అక్కడ కూడా రేవంత్​ను తప్పిస్తారని గట్టిగా చెబుతున్నారు. మరో విషయమేమిటంటే, ప్రజల్లో కాంగ్రెస్​ పట్ల ఏర్పడిన ఏహ్యభావం ఊహించని రీతిలో బిఆర్​ఎస్​కు మద్దతును, సానుభూతిని తెచ్చిపెట్టింది. అప్పుడే బాగుండేదని ఇప్పుడు రాష్ట్ర ప్రజ భావిస్తున్నట్లు సర్వేలు కూడా చెబుతుండటంతో కొంతమంది ఎమ్మెల్యేలు బిఆర్​ఎస్​ వైపు చూస్తున్నట్లు సమాచారం. అందులో మొన్నటి జంపింగ్​ జపాంగ్​లు కూడా ఉండటం విశేషం. ఎలాగూ అనర్హత వేటు తప్పదని తేలిపోయింది. ఉప ఎన్నికలు వస్తే అన్నీ బిఆర్​ఎస్​కే పోతాయనేది వారి ఆలోచన. ముందే కేసీఆర్​ కాళ్లమీద పడి కాన్సిట్యూయెన్సీ మీద కర్చీఫ్​ వేస్తే బెటర్​ కదా.

ఆరు గ్యారెంటీలు(6 Guarantees) వదిలేసి, హైడ్రా, మూసీల మీద రేవంత్​ ఎందుకు పడ్డాడు? హైడ్రా తన కోసం, మూసీ హైకమాండ్​ కోసమనే బీఆర్​ఎస్​ నేతల సెటైర్ల మధ్య, కాంగ్రెస్​ నాయకులు కూడా ఇది వసూల్​ రాజా వ్యవస్థ అని బాహటంగానే అంటున్నారు. ఇక నెలకోసారి ఐఎఎస్​, ఐపీఎస్​ల బదిలీలు చికాకు కలిగిస్తున్నాయి. బదిలీ అయినవారు వెళ్లి అక్కడ సీట్లో కూర్చోకముందే మరోచోటికి ట్రాన్స్​ఫర్​ వస్తోంది. ఇలా అయితే వారికి కొత్త ప్రాంతం, విభాగంపై పట్టు ఎలా దొరుకుతుంది? పనెలా చేస్తారు? అందుకే రాష్ట్రమంతటా, ట్రాఫిక్ జామ్​లు​, చెత్త, రోడ్లు, హత్యలు, దోపిడీలు, కాలుష్యం, అనారోగ్యాలు చెలరేగిపోతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులకెలాగూ పనిరాదు, అర్థం కాదు. కనీసం అధికారులనన్నా పనిచేయనిస్తే ప్రజలకు కొంచెం ఉపశమనం లభించేదని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులు బిఆర్​ఎస్​తో టచ్​లో ఉంటున్నట్లు సమాచారం. ఎలాగూ రాబోయేది బిఆర్ఎస్​ ప్రభుత్వమేనన్నది వారి నమ్మకంగా చెబుతున్నారు.

ప్రధానంగా మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఉత్తమ్​కుమార్​ రెడ్డి(Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిలు ముఖ్యమంత్రి పోస్టు కోసం తెగ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్​ వర్గాల అంతర్గత చర్చలు. నిజానికి కూడా వారు తప్ప ఇంకెవరూ లేరు.  పొంగులేటి(Ponguleti) పాలపొంగులను ఇప్పుడు అధిష్టానం నమ్మడంలేదు. కాకతీయ కెనాల్​ అంత కూడా లేని కొరియా కాలువను పట్టుకుని మూసీ రిజొనవేషన్​ అనీ, బ్యూటిఫికేషన్​ అని, రివర్​ఫ్రంటనీ పదిహేను రోజులు తిరిగి, సమాధానం లేక బాంబులేస్తాం, పేల్చేస్తామంటే, కేరళ నుంచి వచ్చి మరీ తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టితిట్టి పోయాడట అధిష్టానం దూత. ఇటువంటి వాటి వల్ల, ఇంకా మంత్రివర్గ విస్తరణ వాయిదాకు కూడా ముఖ్యమంత్రి మార్పు ఆలోచనే కారణమని మహేశ్వర్​రెడ్డి చెప్పిన మరోమాట.

 

కేటీఆర్(KTR)​ కూడా ఎక్కడా దొరక్కుండా నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి రావడమే మా లక్ష్యమని చెబుతున్నాడు. ఈ వ్యూహాత్మక రాజకీయాల నడుమ తెలంగాణ నలిగిపోతోంది. ఏదేమైనా 2025 మాత్రం పసందైన రాజకీయ విందుని మాత్రం ఇవ్వబోతోందని అన్ని పార్టీల గట్టి నమ్మకం, కాంగ్రెస్​తో సహా.