Gujarat | 9 రోజుల్లో 1400 కోట్లు కొట్టేశాడు.. గుజరాత్‌లో చైనీయుడి ఘరానా మోసం

Gujarat | గుజరాత్‌లో చైనీయుడి ఘరానా మోసం 1200 మంది నుంచి 1400 కోట్లు వసూలు దేశం వదిలి చైనాకు పరార్‌ జూన్‌లోనే పసిగట్టిన నిఘా వర్గాలు అంతా అయిపోయాక దర్యాప్తు 12 మంది భాగస్వాముల అరెస్ట్‌ ఆ ‘ఇద్దరూ’ అసమర్థులా? మోదీ, షాపై జైరాం రమేశ్‌ సెటైర్‌ అహ్మదాబాద్‌: ఫుట్‌బాల్‌ బెట్టింగ్‌పై యాప్‌ తయారు చేసిన ఓ చైనీయుడు.. 9 రోజుల వ్యవధిలో 1200 మంది నుంచి 1400 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఈ […]

Gujarat | 9 రోజుల్లో 1400 కోట్లు కొట్టేశాడు.. గుజరాత్‌లో చైనీయుడి ఘరానా మోసం

Gujarat |

  • గుజరాత్‌లో చైనీయుడి ఘరానా మోసం
  • 1200 మంది నుంచి 1400 కోట్లు వసూలు
  • దేశం వదిలి చైనాకు పరార్‌
  • జూన్‌లోనే పసిగట్టిన నిఘా వర్గాలు
  • అంతా అయిపోయాక దర్యాప్తు
  • 12 మంది భాగస్వాముల అరెస్ట్‌
  • ఆ ‘ఇద్దరూ’ అసమర్థులా?
  • మోదీ, షాపై జైరాం రమేశ్‌ సెటైర్‌

అహ్మదాబాద్‌: ఫుట్‌బాల్‌ బెట్టింగ్‌పై యాప్‌ తయారు చేసిన ఓ చైనీయుడు.. 9 రోజుల వ్యవధిలో 1200 మంది నుంచి 1400 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఈ ఘరానా మోసం గుజరాత్‌లో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. వూ యుయెన్‌బె అనే చైనీయుడు 2020-2022 మధ్యకాలంలో భారతదేశంలో ఉన్నాడు.

కొంతకాలం గుజరాత్‌కు వచ్చి.. అక్కడ పటాన్‌, బనస్కాంత జిల్లాలో తిరిగాడు. పలువురిని కలిసి.. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా కోట్లకు కోట్లు సంపాదించవచ్చని ఆశ పెట్టాడు. వారితో కలిసి 2022లో ఒక యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌ మొత్తంగా పనిచేసింది 9 రోజులు మాత్రమే. ఈ సమయంలోనే అతడు దాదాపు 1400 కోట్లు కొల్లగొట్టి.. పరారయ్యాడు.

తొమ్మిది రోజుల తర్వాత ఉన్నట్టుండి యాప్‌ పనిచేయకపోవడంతో అందులో పందేలు కాసినవారికి తాము మోసపోయామని అర్థమైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ యాప్‌ తయారీలో చైనీయుడితో భాగస్వాములుగా ఉన్న 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

వీరు షెల్‌ కంపెనీలు పెట్టి, సొమ్మును వాటిలోకి మళ్లించారని పోలీసులు గుర్తించారు. ఇది పోలీసుల దృష్టికి వచ్చి గతేడాది ఆగస్టులోనే కేసు నమోదు చేసినా.. అప్పటికే యుయెబె దేశం వదలిపరారయ్యాడు. చైనాలోని షెన్‌జెన్‌ ప్రాంతం నుంచి యుయెబె తన అక్రమ కార్యకలాపాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆ ఇద్దరూ అసమర్థులా?

గుజరాత్‌లో చైనీయుడి ఘరానా మోసంపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాల నుద్దేశించి సెటైర్లు వేశారు. ‘ప్రధాని గుజరాత్‌ నుంచే. హోంమంత్రీ గుజరాత్‌ నుంచే. గుజరాత్‌లోని ప్రభుత్వాన్ని పూర్తిగా నియంత్రించేదీ ‘ఈ ఇద్దరే’. దేశ, రాష్ట్ర నిఘా విభాగాలను కూడా ‘ఈ ఇద్దరే’ నియంత్రిస్తారు. దర్యాప్తు సంస్థలూ ‘ఈ ఇద్దరి’ కిందే ఉంటాయి.

కానీ ‘ఈ ఇద్దరూ’ తమ రాజకీయ ప్రత్యర్థులను, స్వతంత్ర గొంతుకలను, వారి రాజకీయాలకు ఇబ్బందిగా అనిపించినవారిని టార్గెట్‌ చేయడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. ఈలోపు చైనా నుంచి ఒక వ్యక్తి గుజరాత్‌ వచ్చాడు. పాకిస్థాన్‌ సరిహద్దుకు అత్యంత సమీపంలోని బనస్కాంత, పటాన్‌ జిల్లాల్లో నివాసం ఉన్నాడు. చట్ట విరుద్ధంగా ఒక యాప్‌ను తయారు చేసి, 9 రోజుల్లో 1200 మందికి టోకరా ఇచ్చి గుజరాత్‌ నుంచి, భారత్‌ నుంచి బిచాణా ఎత్తేశాడు. మరి ‘ఈ ఇద్దరూ’ అసమర్థులా? లేక వారు ఇలాంటివి లెక్కచేయరా?