రూ. 27 ల‌క్ష‌లు ప‌లికిన బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డూ.. ద‌క్కించుకున్న ద‌యానంద్ రెడ్డి

రూ. 27 ల‌క్ష‌లు ప‌లికిన బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డూ.. ద‌క్కించుకున్న ద‌యానంద్ రెడ్డి

విధాత: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో రూ.27 లక్షలకు దాస‌రి ద‌యానంద్ రెడ్డి ద‌క్కించుకున్నారు.


గ‌తేడాది బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని వేలం పాట‌లో రూ. 24.60 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అంటే గ‌తేడాది కంటే రూ. 2.5 ల‌క్ష‌లు అధికంగా ప‌లికింది.



 


బాలాపూర్‌ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 36 మంది పాల్గొన్నారు. వారిలో ముగ్గురు స్థానికులు ఉండగా, మిగ‌తా వారంతా స్థానికేతరులు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.


1980లో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటయింది. 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. తొలి ఏడాది రూ.450కి లడ్డూ పాటలో దక్కించుకోగా 2017లో రూ.15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రద్దయింది. గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట గణనాథుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నది.


లడ్డూ దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలతోపాటు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటున్నది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది.


ఇప్పటి వరకు జరిగిన లడ్డూ వేలం-విజేతలు


1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450

1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500

1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు

1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు

1998లో కొలన్‌ మోహన్‌ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు

1999 కళ్లెం ప్రతాప్‌ రెడ్డి- రూ.65 వేలు

2000 కొలన్‌ అంజిరెడ్డి- రూ.66 వేలు

2001 జీ. రఘనందన్‌ రెడ్డి- రూ.85 వేలు

2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000

2003లో చిగిరినాథ బాల్‌ రెడ్డి- రూ.1,55,000

2004లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.2,01,000

2005లో ఇబ్రహీ శేఖర్‌- రూ.2,08,000

2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు

2007లో జీ రఘనాథమ్‌ చారి- రూ.4,15000

2008లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.5,07,000

2009లో సరిత- రూ.5,10,000

2010లో కొడాలి శ్రీదర్‌ బాబు- రూ.5,35,000

2011లో కొలన్‌ బ్రదర్స్‌- రూ.5,45,000

2012లో పన్నాల గోవర్ధన్‌ రెడ్డి- రూ.7,50,000

2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000

2014లో సింగిరెడ్డి జైహింద్‌ రెడ్డి- రూ.9,50,000

2015లో కొలన్‌ మధన్‌ మోహన్‌ రెడ్డి- రూ.10,32,000

2016లో స్కైలాబ్‌ రెడ్డి- రూ.14,65,000

2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు

2018లో తేరేటి శ్రీనివాస్‌ గుప్తా- రూ.16,60,000

2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు

2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు

2021లో మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌- రూ.18.90 లక్షలు

2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000

2023లో దాసరి దయానంద్ రెడ్డి – రూ. 27 ల‌క్ష‌లు