కండ‌క్ట‌ర్‌ను ఎక్కించుకోకుండా.. బ‌స్సును 10 కి.మీ. తీసుకెళ్లిన డ్రైవ‌ర్

కండ‌క్ట‌ర్‌ను ఎక్కించుకోవ‌డం మ‌రిచిపోయిన ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ బ‌స్సును 10 కిలోమీట‌ర్లు తీసుకెళ్లాడు

కండ‌క్ట‌ర్‌ను ఎక్కించుకోకుండా.. బ‌స్సును 10 కి.మీ. తీసుకెళ్లిన డ్రైవ‌ర్

నిజామాబాద్: కండ‌క్ట‌ర్‌ను ఎక్కించుకోవ‌డం మ‌రిచిపోయిన ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ బ‌స్సును 10 కిలోమీట‌ర్లు తీసుకెళ్లాడు. బ‌స్సు వేగంగా ప‌లు గ్రామాలు, స్టేజీలు దాటుతున్న‌ప్ప‌టికీ, కండ‌క్ట‌ర్ మాత్రం క‌నిపించ‌లేదు. దీంతో బ‌స్సులో కండ‌క్ట‌ర్ లేడ‌న్న విష‌యాన్ని ప్ర‌యాణికులు డ్రైవ‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌గా, అప్పుడు బ‌స్సును ఆపాడు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ డిపో ప‌రిధిలో ఆదివారం చోటు చేసుకుంది.


వివ‌రాల్లోకి వెళ్తే.. బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళ్లే బ‌స్సులో ప్ర‌యాణికులు భారీ సంఖ్య‌లో ఎక్కారు. ఇక కండ‌క్ట‌ర్ కూడా బ‌స్సు ఎక్కి ఉండొచ్చ‌ని భావించిన డ్రైవ‌ర్.. బ‌స్సును స్టార్ట్ చేశాడు. న‌స్రూల్లాబాద్ మండ‌లం నెమ్లి గ్రామ శివారులో కండ‌క్ట‌ర్ లేడ‌ని డ్రైవ‌ర్‌కు ప్ర‌యాణికులు తెలియ‌జేశారు. అప్ప‌టికే బ‌స్సు 10 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించింది. దీంతో అక్క‌డే బ‌స్సును ఆపేసి, మ‌రో బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను ఎక్కించాడు డ్రైవ‌ర్.


ఈ ఘ‌ట‌న‌పై బాన్సువాడ డిపో మేనేజ‌ర్ స‌రితా దేవిని వివ‌ర‌ణ కోర‌గా.. కండక్ట‌ర్ బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను ఎక్కించిన అనంత‌రం.. కంట్రోల‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లొస్తాన‌ని చెప్ప‌గా, ర‌ద్దీ అధికంగా ఉండ‌టంతో బ‌స్సును తీయ‌మ‌ని చెప్పాడ‌నుకొని బ‌య‌లుదేరిన‌ట్లు ఆమె తెలిపారు. డ్రైవ‌ర్, కండక్ట‌ర్ ఇద్ద‌రిని విచారించి, త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డిపో మేనేజ‌ర్ స్ప‌ష్టం చేశారు.